అతిలోక సుందరి శ్రీదేవి భారతదేశం మొత్తం మెచ్చిన గొప్ప హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది. శ్రీదేవి తెలుగు మూలాలు ఉన్న తమిళ అమ్మాయి. శ్రీదేవి పూర్వీకుల స్వస్థలం ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా. వాళ్లు కొన్ని సంవత్సరాల క్రితమే తమిళనాడులోని శివకాశి వెళ్లి అక్కడ స్థిరపడిపోయారు. శ్రీదేవి అక్కడే జన్మించింది. శ్రీదేవి తల్లి పేరు రాజ్యలక్ష్మి, తండ్రి అయ్యప్పన్ అడ్వకేట్‌గా పనిచేసేవారు.శ్రీదేవి చెన్నైలో చదువుకునే రోజుల్లో వాళ్లకు తినడానికి సరిగా తిండి కూడా ఉండేదే కాదట. శ్రీదేవి తల్లిదండ్రులు చాలా చిన్న ఇంట్లో ఉండేవారు.
శ్రీదేవి తల్లి సినిమాల్లో గ్రూపు డ్యాన్సర్లలో ఒకరిగా పనిచేసేవారు. ఆమె రోజంతా గ్రూపు డాన్సర్లలో ఒకరిగా పనిచేసే వచ్చిన సంపాదనతో కుటుంబాన్ని నెట్టుకు వచ్చేవారట. శ్రీదేవి తండ్రి అయ్యప్పన్ అడ్వకేట్. ఆయనకు కేసులు సరిగా వచ్చేవే కావట. అందుకే ఆయన ఇంట్లోనే ఎక్కువగా కాలం గడిపే వారని.. ఆయన గురించి బాగా తెలిసిన సీనియర్ జర్నలిస్టు వాసిరాజు ప్రకాశం ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
శ్రీదేవి తల్లి రాజ్యలక్ష్మి కుటుంబం మొత్తాన్ని నెట్టుకు వచ్చేవారని.. తండ్రి అయ్యప్పన్ అమాయకుడు అని … ఇక శ్రీదేవిని చదివించుకోవడం దగ్గర నుంచి ఆమెను పెంచి పెద్ద చేయటం.. సినిమాల్లో అవకాశాలు వచ్చినప్పుడు సరైన మార్గదర్శకురాలిగా వ్యవహరించడం అన్నీ కూడా తల్లి రాజ్యలక్ష్మి దగ్గరుండి చూసుకునేవారని ప్రకాశం చెప్పారు. శ్రీదేవికి బాలనటిగానే సినిమాల్లో నటించే అవకాశాలు వచ్చాయి.
అప్పట్లోనే శ్రీదేవి చాలా అందంగా ఉండేది.. ఆమెను చూసిన వారంతా కచ్చితంగా గొప్ప హీరోయిన్ అవుతుందని అనేవారు. చివరకు అదే నిజం అయింది. శ్రీదేవి హీరోయిన్ అయ్యాక వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం లేకుండా పోయింది. ఇక శ్రీదేవి కుటుంబం ముందు రు. 150 అద్దె ఇంట్లో ఉండేవారట. శ్రీదేవికి సినిమాల్లో ఛాన్సులు రావడం మొదలు పెట్టాక ఘంటశాల ఇంటి పక్కన నెలకు రు. వెయ్యి అద్దె చెల్లిస్తూ ఓ పెద్ద ఇంట్లోకి మారారట.
ఆ తర్వాత ఆమె హీరోయిన్‌గా బాగా సంపాదించడం ప్రారంభించాక ఒక్క చెన్నైలోనే మూడు ఇళ్లు కొనేశారట. అలాగే మద్రాస్ నడిబొడ్డున ఓ హోటల్ కూడా ఆమె కొన్నారు. అయితే ఆమె ముంబైకు వెళ్లినప్పుడు ఈ హోటల్ అమ్మేశారు. అలా రు. 150 అద్దె ఇంటి నుంచి ప్రారంభమైన శ్రీదేవి ప్రస్థానం కోట్ల వరకు వెళ్లింది.