సహజంగా ఎన్టీఆర్ ఏ దైనా సినిమాను ఒప్పుకుంటే.. దానిని వదిలిపెట్టే మనస్త్వత్వం తక్కువ. ఆయన ఏం చేసినా.. మనసు పెట్టి చేసేవారు. అయితే, ఆయన కెరీర్‌లో కొన్ని సినిమాలను వదిలేసుకున్నారు. దీనికి కారణం ఉన్నా.. కొన్ని కొన్ని సినిమాలు వదులుకుని ఆయన ఆవేదన చెందిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలాంటి వాటిలో అక్కినేని నటించిన `భక్త తుకారం` సినిమా ముందు వరసులో ఉంది. అదేవిధంగా శోభన్‌బాబు నటించిన మానవుడు-దానవుడు సినిమాను కూడా అన్నగారు వదిలేసుకున్నారు.
వాస్తవానికి ఈ సినిమా ఆఫర్ అన్నగారికే వచ్చింది. నిర్మాత, దర్శకులు కూడా అన్నగారి కోసమే ఈ సినిమాను తయారు చేశారు. అయితే, అన్నగారికి కథ చెప్పిన తర్వాత ఆలోచించి చెబుతాను అన్నారు. అప్పటికే కృష్ణుడు, రాముడి వేషాల్లో ఆయన దూకుడుగా ఉన్న నేపథ్యంలో ఇలాంటి మాస్ సినిమా జనాలకు ఎక్కుతుందో లేదో అనే భావన ఆయనలో ఏర్పడింది. దీనిపై ఒకటి రెండు రోజులు ఆలోచించిన అన్నగారు.. అనూహ్యంగా దీనిని వదిలేసుకున్నారు.
అనంతరమే ఈ సినిమా ఆఫర్ శోభన్‌బాబుకు వెళ్లింది. ఆ సినిమాలో ఎక్కువ మంది సీనియర్ ఆర్టిస్టులు ఉండడాన్ని బట్టి అన్నగారిని దృష్టిలో పెట్టుకునే ఈ సినిమాకు రూపకల్పన జరిగిందనేది చెప్పొచ్చు. ఇదే విషయాన్ని తర్వాత.. చాలా మంది చెప్పారు కూడా. కానీ, అన్నగారు ఈ సినిమా మాత్రం పెద్దగా పోదని అనుకున్నారు. అంతేకాదు. ఇలాంటి సినిమాలు ప్రజలు ఆదరిస్తారా? అని కూడా సందేహం వ్యక్తం చేశారు. ఇలాంటి సమయంలో శోభన్‌బాబు దక్కించుకున్న ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కొట్టింది.
దీనిని తెలుసుకుని.. మొదట్లో తను మిస్ చేసుకున్నానే అని భావించినా.. యంగ్ హీరోగా అప్పుడే శోభన్‌బాబు.. పుంజుకుంటున్న నేపథ్యంలో అన్నగారు స్వయంగా ఆయనను పిలిచి అభినందించారనేది సినీ వర్గాలు అప్పట్లో చెప్పుకొనేవి. కొన్ని కొన్ని సందర్భాల్లో అన్నగారు చేసిన ఈ చిన్న చిన్న పొరపాట్లు కొన్ని సూపర్ హిట్ సినిమాలకు ఆయనను దూరం చేసిందనే వాదన ఉంది.