టాలీవుడ్ టాప్ దర్శకుడు కొరటాల శివ తాను సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నట్టు చేసిన ప్రకటన ఇండస్ట్రీ వర్గాల్లో ఒక్కసారిగా కలకలం రేపింది. కొరటాల సోషల్ మీడియా ద్వారా ఎన్నో విషయాలు గతంలో మీడియాతో పంచుకున్నారు. అలాంటి ఆయన ఇప్పుడు ఉన్నట్టుండి ఒక్కసారిగా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో ? ఎవ్వరికి అర్థం కాలేదు. అయితే ఈ సమస్య ఒక్క కొరటాలది మాత్రమే కాదు… గతంలోనూ ఎంతో మంది సెలబ్రిటీలు సోషల్ మీడియాలో తమపై వస్తోన్న చికాకు వార్తలను సహించలేకే తాత్కాలికంగా లేదా టోటల్‌గా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్‌కు గుడ్ బై చెప్పేసిన సంగతి తెలిసిందే.
ఇక కొరటాల ఓ స్టార్ హీరోతో సినిమాను ప్రకటించి.. మరో యంగ్ క్రేజీ హీరోతో సినిమా కోసం ముందుగా ప్రకటించిన సినిమాను పక్కన పెట్టారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. క్రియేటివ్ డిఫరెన్సెస్ రావడం.. కథ అనుకున్నట్టుగా సెట్ కాకపోవడం ఇలా చాలానే ఉన్నాయి. ఇక ఆచార్య సినిమాను మూడేళ్ల నుంచి తీస్తూనే ఉన్నారు. దీనిపై మెగా అభిమానులు కూడా ట్రోల్ చేస్తున్నారు. ఆ సినిమా అవుట్ ఫుట్ సరిగా లేదని.. చిరు – కొరటాల మధ్య గ్యాప్ వచ్చిందని కూడా కొందరు ప్రచారం చేస్తున్నారు.
దీని వల్ల తాను డిస్టర్బ్ అవుతున్నానని.. వీటికి దూరంగా ఉండడమే మంచిదని నిర్ణయించుకునే కొరటాల సోషల్ మీడియాకు దూరమవ్వాలన్న కఠిన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కరోనా వల్ల కొరటాల ప్రాజెక్టులు బాగా డిలే అయ్యాయి. ఈ కారణంతోనే కొందరు హీరోలతో ముందుగా అనుకున్న సినిమాలు ఆయన చేయలేకపోయారు. అయితే దీనికే ఒక్కో హీరో ఫ్యాన్స్ ఒక్కోలా కొరటాలను ట్రోల్ చేయడం ఆయనకు ఏ మాత్రం నచ్చలేదని అంటున్నారు.