Newsడ‌బ్బు-తుపాకీ-విదేశీ కార్లు..ఎస్వీ రంగారావు లైఫ్ స్టైల్ చూస్తే క‌ళ్లు జిగేల్‌...!

డ‌బ్బు-తుపాకీ-విదేశీ కార్లు..ఎస్వీ రంగారావు లైఫ్ స్టైల్ చూస్తే క‌ళ్లు జిగేల్‌…!

విశ్వ‌న‌ట‌చ‌క్ర‌వ‌ర్తిగా ప్రేక్ష‌కుల హృద‌యాల‌ను కొల్ల‌గొట్టిన ఎస్వీ రంగారావు.. జీవించిన‌న్నాళ్లూ ద‌ర్పంతోనే బ‌తికారు. ఆయ‌న స్ట‌యిల్‌ను అనుకురించేందుకు చాలా మంది ప్ర‌య‌త్నించినా.. సాధ్యం కాలేదు. షావుకారు సినిమాకంటే ముందుగానే ఆయ‌న ఒక చిత్రంలో న‌టించినా.. అది విడుద‌ల కాలేదు. కానీ, షావుకారులో మాత్రం ఆయ‌న న‌ట‌న‌కు ప్రేక్ష‌కులు ముగ్ధుల‌య్యా రు. స‌న్న‌గా ఆరు అడుగుల ఆజానుబాహుడిగా ఉన్న రంగారావు.. తొలినాళ్ల‌లోనే అమితంగా ఆక‌ట్టుకున్నారు.

త‌ర్వాత పౌరాణి క సినిమాల‌తో ఆయ‌న ద‌శ తిరిగిపోయింది. అంతే.. ఎన్టీఆర్‌, అక్కినేనిల కంటే కూడా అధికంగానే పారితోషికం తీసుకున్న న‌టుడిగా ఆయ‌న పేరుతెచ్చుకున్నారు. అస‌లు వారికంటే ఎక్కువ ఇస్తే త‌ప్ప న‌టించే ప‌రిస్థితి లేకుండా పోయింది. రంగారావు గొప్ప నటుడే కాదు.. పుస్తక ప్రియుడు కూడా. షూటింగ్‌ స్పాట్‌లో కాస్త గ్యాప్‌ దొరికితే చాలు ఏదో పుస్తకం చదువుతుండేవారు.

ముఖ్యంగా ఆయనకు వివేకానందుని రచనలంటే చాలా ఇష్టం. ఆయనకు సంబంధించిన పుస్తకాలు సేకరించి భద్రపరిచేవారు. రంగారావుకు ఉన్న మరో హాబీ ఫొటోగ్రఫీ. ఆయన దగ్గర రకరకాల కెమెరాలు ఉండేవి. వాటితోపాటు 16 ఎం.ఎం. కెమెరా కూడా ఉండేది. కొల్లేరు ప్రాంతానికి వెళ్లినప్పుడు అక్కడి రమణీయ దృశ్యాలను 16 ఎం.ఎం. కెమెరాతో చిత్రీకరించి, చెన్నై తిరిగి వచ్చిన తర్వాత తన మిత్రులకు ప్రదర్శించి చూపించేవారు.

ఇక‌, ద‌ర్శ‌క‌త్వంలోనూ రంగారావుకు ప్ర‌త్యేక స్థానం ఉంది. ఆయ‌న‌ దర్శకత్వం వహించిన ‘చదరంగం’, ‘బాంధవ్యాలు’ చిత్రాలు ప్రేక్షకుల ప్రశంసల్నీ, ప్రభుత్వ అవార్డుల్నీ పొందాయి. ఆర్టిస్ట్‌గా తనకు ఎంతో డిమాండ్‌ ఉన్నా పారితోషికం విషయంలో మాత్రం లిబరల్‌గా ఉండేవారు. పారితోషికం ఎక్కువ‌గానే తీసుకున్నా దాని కోసం రంగారావు నిర్మాతలను పీడించిన సందర్భాలు లేవు కానీ ఎన్టీఆర్‌, ఏయన్నార్‌ కంటే ఒక్క రూపాయి అయినా తన పారితోషికం ఎక్కువగా ఉండాలని ఆయన పట్టుబట్టిన సంఘటనలు అనేకం ఉన్నాయి.

రంగారావుకు ఉన్న మ‌రో హాబీ వేట. ఇప్పుడంటే వేట నిషేధించారు కానీ.. అప్ప‌ట్లో వేట‌కు అనుమ‌తి ఇచ్చేవారు. ఆ రోజుల్లో ప్రతి నెలా వేటకు వెళ్లేవారు. అలా తెచ్చిన దుప్పి.. ఇత‌ర అట‌వీ మృగాల‌తో ఆయ‌న ఆహారం చేయించి అంద‌రికీ పంచేవార‌ట‌. ఒక్కోసారి ఆయనతో పాటు శివాజీగణేశన్‌ కూడా వెళ్లేవారు. రంగారావు దగ్గర ఓ తుపాకీ ఉండేది. అది చాలా బరువైంది కూడా. వారానికి ఒకసారి ఆ తుపాకిని శుభ్రం చేసేవారు. ఇలా.. త‌న జీవితంలో ఒక రారాజులా వెలిగిన రంగారావుకు ప‌ద్మ‌శ్రీ వంటి పుర‌స్కారాలు రాక‌పోయినా.. ఇప్ప‌టికీ ఆయ‌న చిర‌స్థాయిగా నిలిచిపోయారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news