టాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమాలలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా ఒకటి. త్రిబుల్ ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమా తర్వాత.. ఎన్టీఆర్ నుంచి వస్తున్న సినిమా కావడంతో.. అంచనాలు మామూలుగా లేవు. దీనికి తోడు ఆచార్య లాంటి డిజాస్టర్ తర్వాత కొరటాల శివ కసితో దేవర సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు అటు కొరటాల సన్నిహితుడు మిక్కిలినేని సుధాకర్.. ఇటు ఎన్టీఆర్ సోదరుడు నందమూరి కళ్యాణ్ రామ్ ఇద్దరు నిర్మాతలుగా ఉన్నారు.
గతంలో ఎన్టీఆర్ – కొరటాల కాంబినేషన్ వచ్చిన జనతా గ్యారేజ్ సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంతో.. ఈసారి దేవర కచ్చితంగా పాన్ ఇండియా రేంజ్‌లో బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందన్న అంచనాలు అయితే ఉన్నాయి. రెండు పార్ట్‌లుగా రిలీజ్ అవుతున్న దేవర.. తొలిభాగం వచ్చేనెల 27వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ రెండు పాత్రలలో నటిస్తుండడంతో.. అభిమానులు దేవరను ఎప్పుడు వెండితెరపై థియేటర్లలో చూద్దామా అని ఒక్కటే ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.
ఇక దేవర సినిమా రిలీజ్ ను ఈ సినిమా మేకర్స్ ఓ పండగలా ప్లాన్ చేస్తున్నారు. అర్ధరాత్రి నుంచే దేవర షోలు ప్రారంభం కానున్నాయి. అటు అమెరికాతో పాటు.. ఇటు ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటకలోనూ అర్ధరాత్రి ఒంటిగంట నుంచే దేవర ప్రీమియర్ షోలు ప్రదర్శించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. తొలిరోజు ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో ఫోలు వేయనున్నారు. థియేటర్లలో అభిమానుల జాతర కు తోడు.. సినిమాకు సూపర్ హిట్ టాక్ వస్తే తొలి రోజు ఎన్టీఆర్ రికార్డులకు పాతర వేయటం ఖాయంగా కనిపిస్తోంది. ఎన్టీఆర్ కు జోడిగా జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు.