ప్రస్తుత తరంలో క్రికెటర్లకు భారీగా ఆదాయం వస్తోంది. పలు కంపెనీలు వారిని తమ బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించుకుంటున్నాయి. ఇందుకు వారికి కోట్ల రూపాయలను ఇస్తున్నాయి. దీంతో ఏటా క్రికెటర్ల ఆదాయం పెరుగుతూ వస్తోంది. ఇక కోహ్లి ఆదాయం ఇటీవల రూ.1000 కోట్లు దాటింది. ఇక ఇప్పటికే ధోని, సచిన్ వంటి వారి ఆస్తులు రూ.1000 కోట్లు దాటాయి. అయితే వారిని మించి ఓ క్రికెటర్ బాగా ఆస్తులను కలిగి ఉన్నాడు.
అయితే మరో టీమిండియా క్రికెటర్ అనుకుంటే పొరపాటే. ఎందుకంటే అతడు కనీసం జాతీయ జట్టుకు కూడా ఏనాడూ ఎంపిక కాలేదు. అతని ఆస్తుల నికర విలువ రూ.20,000 కోట్లు. అతడెవరో కాదు.. ఒకప్పటి రంజీ క్రికెటర్ సమర్జిత్ సింగ్ గైక్వాడ్. అయితే టీమిండియాకు కూడా ఎంపిక కాని క్రికెటర్ ఆస్తులు రూ.20000 వేల కోట్లు ఎలా వచ్చాయా అని ఆలోచిస్తున్నారా? అవన్నీ పూర్వీకుల నుంచి వచ్చినవి. దేశంలోనే అత్యంత ధనిక క్రికెటర్ అయిన సమర్జిత్ సింగ్ గైక్వాడ్ గురించి తెలుసుకుందాం.
సమర్జిత్ సింగ్ గైక్వాడ్ 25 ఏప్రిల్ 1967న జన్మించారు. అతను బరోడాకు చెందిన రాజా రంజిత్ సింగ్ గైక్వాడ్-సుభాంగిని రాజేల ఏకైక కుమారుడు. వేల కోట్ల ఆస్తికి ఏకైక వారసుడు. సమర్జీత్ సింగ్ గైక్వాడ్ మాజీ ఫస్ట్ క్లాస్ క్రికెటర్. అతను 1987 నుండి 1989 వరకు గుజరాత్ స్వదేశీ జట్టు బరోడా తరపున క్రికెట్ ఆడాడు. బరోడా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా పనిచేశాడు.
సమర్జిత్ సింగ్ గైక్వాడ్ గుజరాత్‌లోని బరోడా మాజీ రాజా. అతని తండ్రి రంజిత్ సింగ్ ప్రతాప్ సింగ్ గైక్వాడ్ మరణం తరువాత అతనికి పట్టాభిషేకం జరిగింది. నివేదికల ప్రకారం సమర్జీత్ సింగ్ గైక్వాడ్ రూ.20 వేల కోట్ల ఆస్తికి యజమాని. వారికి లక్ష్మీ విలాస్ ప్యాలెస్ కూడా ఉంది. వారు గుజరాత్, బనారస్, ఉత్తరప్రదేశ్‌లలో 17 దేవాలయాల నిర్వహణ బాధ్యతలను చూస్తున్నారు.
ఇక వంకనేర్ రాష్ట్ర రాజకుటుంబానికి చెందిన కుమార్తె రాధికరాజేని ఆయన వివాహం చేసుకున్నాడు. ఆయన మొదటి స్థానంలో ఉండగా సచిన్ టెండూల్కర్ రూ.1250 కోట్ల ఆస్తులతో రెండో స్థానంలో ఉన్నాడు. రూ.1050 కోట్ల ఆస్తులతో కోహ్లి మూడో స్థానంలో, రూ.1040 కోట్ల ఆస్తులతో ధోని నాలుగో స్థానంలో ఉన్నారు.