MoviesTL రివ్యూ: శాకుంతలం ఓ అదృశ్య కావ్యం

TL రివ్యూ: శాకుంతలం ఓ అదృశ్య కావ్యం

టైటిల్‌: శాకుంతలం
నటీనటులు: సమంత, దేవ్ మోహన్, సచిన్ ఖేద్కర్, మోహన్ బాబు, అనన్య నాగళ్ళ, అదితి బాలన్, శివ బాలాజీ సుబ్బరాజు తదితరులు
సంగీతం: మణిశర్మ
మాటలు: సాయిమాధవ్ బుర్రా
నిర్మాతలు: నీలిమ గుణ-దిల్ రాజు
రచన-దర్శకత్వం: గుణశేఖర్
రిలీజ్ డేట్‌: 14 ఏప్రిల్‌, 2023
వ‌ర‌ల్డ్‌వైడ్ ప్రి రిలీజ్ బిజినెస్: రు. 24 కోట్లు

శాకుంత‌లం ప‌రిచ‌యం :
కెరీర్ ప్రారంభం నుంచి వైవిధ్య‌మైన‌ సినిమాలకు పెట్టింది పేరు గుణశేఖర్. గుణశేఖర్ పని అయిపోయింది అని విమర్శలు వస్తున్న టైం లో భారీ రిస్కులు చేసి తన కెరీర్ నిలబెట్టుకుంటూ వస్తున్నాడు. 8 ఏళ్ల క్రిందట అనుష్కతో రుద్రమదేవి లాంటి హిస్టారికల్ మూవీతో మెప్పించాడు. ఆ తర్వాత సుదీర్ఘమైన విరామంతో సమంత ప్రధాన‌పాత్రలో శాకుంతలం పేరుతో ఆయన మరోసాహసం చేశారు. మూడు సంవత్సరాలుగా ఊరిస్తూ వస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందో లేదో TL సమీక్షలో చూద్దాం.

స్టోరీ :
విశ్వామిత్రుడు చేస్తున్న తపస్సుని భంగం చేయడానికి మేనక ( మధుబాల ) ను భూలోకానికి ఇంద్రుడు పంపుతాడు. ఈ క్రమంలోనే తన అంద చందాలతో మేనక విశ్వామిత్రుడి తపస్సుకి భంగం కలిగిస్తుంది. ఈ క్రమంలో వారిద్దరు శారీరకంగానూ ఒక్కటవుతారు. ఈ ఫలితంగా మేనక ఓ ఆడబిడ్డకి జన్మనిస్తుంది. ఓ మనిషి వల్ల పుట్టిన బిడ్డకి దేవలోకంలో ప్రవేశం ఉండదు. అందుకే మేనక ఆ చిన్నారిని భూలోకంలో వదిలి వెళ్ళిపోతుంది. ఆ చిన్నారిని చూసిన ఓ పక్షుల గుంపు మాలినీ నది తీరాన ఉన్న కన్వ మహర్షి ( సచిన్ ఖేద్క‌ర్ ) ఆశ్రమానికి తరలిస్తాయి. ఆమెకు శకుంతల ( సమంత ) అనే పేరు పెట్టిన కన్వ‌ మహర్షి ఆమెను కన్నబిడ్డలా పెంచి పెద్ద చేస్తాడు.

ఒకరోజు దుష్యంత మహారాజు ( దేవ్ మోహన్ ) ఆశ్రమానికి వెళ్లి శకుంతలని చూసి తొలిచూపులో ప్రేమలో పడతాడు. శకుంతల కూడా దృష్యంత మహారాజుని ప్రేమిస్తుంది. వీరిద్దరూ గాంధర్వ వివాహంతో ఒకటవుతారు. ఆ తర్వాత దుష్యంత మహారాజు తిరిగి రాజ్యానికి వెళ్లి పట్టపు మనిషిగా శకుంతలను తీసుకుని వెళ్తానని చెబుతాడు. అప్పటికే శకుంతల గర్భిణిగా ఉంటుంది. అదే సమయంలో ఆ ఆశ్రమానికి దుర్వాస‌ మహర్షి ( మోహన్ బాబు) వస్తాడు.

శకుంతల తనను అవమానించిందన్న కారణంతో నీ భర్త నిన్ను మర్చిపోతాడని శపిస్తాడు. ఆ తర్వాత గర్భిణీగా ఉన్న శకుంతల దుష్యంత రాజ్యంలోకి వెళుతుంది. అక్కడ ఆమెకు జరిగిన అవమానం ఏమిటి ?శకుంతల గర్భంలో పెరుగుతున్న బిడ్డకు తాను తండ్రిని కాదని దుష్యంతుడు ఎందుకు చెప్పాడు ? ఆ సమయంలో శకుంతల పడిన బాధలు ఏమిటి ? ఆమెకు పుట్టిన బిడ్డ ఎక్కడ పెరిగాడు ? తిరిగి దుష్యంతుడు శకుంతల ఎలా కలిశారు అన్నదే ఈ సినిమా కథ.

TL విశ్లేష‌ణ :
కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం నాటకం ఆధారంగా గుణశేఖర్ ఈ సినిమాను తెరకెక్కించాడు. ఇది ఒక అందమైన ప్రేమ కథ అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇలాంటి కథలను తెరకెక్కించాలంటే కత్తి మీద సామూలాంటిదే. ప్రేక్షకులను మరిపించేలా విజువల్ ఎఫెక్ట్స్ – గ్రాఫిక్స్ ఉండాలి. అయితే ఈ విషయంలో గుణశేఖర్ టీం దారుణంగా విఫలమైంది. నాసిరకమైన త్రీడీ హంగులతో సీరియల్‌కు ఎక్కువ.. సినిమాకు తక్కువ అన్నట్టుగా ఈ సినిమాను తెరకెక్కించారు.

అయితే ఒక విషయంలో మాత్రం గుణశేఖర్‌ను మెచ్చుకోవాలి. మహాభారతం చదవకపోయినా శకుంతల అంటే ఎవరో తెలియకపోయినా ? ఈ సినిమా అర్థమవుతుంది. ఒక్కో విషయాన్ని చాలా నీట్ గా అందరికీ అర్థమయ్యేలా వివరించారు. అయితే కథను కథ‌లాగా చెప్పటం ఈ సినిమాకు పెద్ద మైనస్. కథలో ఏ మాత్రం వేగం ఉండదు. బలమైన సంఘర్షణలు, ఎత్తులు లేవు. ఈ సినిమాలో బలమైన కథ‌ లేదు.. ఆసక్తికరమైన కథనం కూడా లేదు. మైమరిపించేలా సాంకేతిక హంగులు కూడా లేవు.

శకుంతల పాత్రకు న్యాయం చేసేందుకు సమంత నూటికి నూరు శాతం ప్రయత్నించింది. ప్రేమికురాలుగా.. భర్తకు దూరమైన భార్య‌గా డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్న పాత్రలో ఆమె మెప్పించింది. అయితే ఆమె డబ్బింగ్ పెద్ద మైనస్. దుష్యంత మహారాజుగా మలయాళ నటుడు దేవ్ మోహన్ బాగానే సెట్ అయ్యాడు. అయితే నటనలో పూర్తిగా తేలిపోయాడు. ఆయన స్థానంలో టాలీవుడ్ ప్రేక్షకులకు బాగా పరిచయం ఉన్న నటుడిని తీసుకుని ఉంటే బాగుండేది అనిపించింది. ఈ పాత్రకు ఒక స్టార్ హీరో ఉంటే సినిమాకు చాలా ప్లస్ అయ్యేది.

సమంతతో సమానంగా ఆ పాత్రకు స్క్రీన్ స్పేస్ ఉంది. అలాంటి పాత్రకు తెలుగు ప్రేక్షకులకు అంతగా తెలియని హీరోని తీసుకుని గుణశేఖర్ సినిమాను నిండా ముంచేశాడు. ఇక దుర్వాసుడిగా మోహన్ బాబు బాగా సెట్ అయ్యాడు. ఆయన తెర‌ మీద కనిపించింది కొద్దిసేపు అయినా ఆకట్టుకున్నాడు. అయితే మేనకగా మధుబాలని చూడటం కాస్త ఇబ్బందిగా అనిపించింది. అల్లు అర్జున్ ముద్దుల కుమార్తె అల్లు అర్హ తన ముద్దు ముద్దు మాటలతో భ‌ర‌తుడి పాత్రకు న్యాయం చేసింది.

టెక్నికల్ గా చూస్తే మణిశర్మ సంగీతం బాగుంది పాటలతో పాటు సినిమాకు తగ్గట్టుగా మంచి నేపథ్య సంగీతం అందించారు. గ్రాఫిక్స్ డిపార్ట్మెంట్ అట్టర్ ప్లాప్. సినిమా పూర్తిగా తేలిపోయింది. 3d అంటూ పెద్ద హడావుడి చేసినా ఆ ఫీలింగ్ లేదు. ఎడిటింగ్ ఓకే.. నిర్మాణ విలువలు అంత గొప్పగా లేవు. దర్శకుడు గుణశేఖర్ విషయానికి వస్తే సినిమాలో ఎమోషనల్ సీన్లు చాలా ఉన్నా.. వాటిని చూసి ప్రేక్షకులు కదిలిపోయేలా తీర్చిదిద్దటంలో గుణశేఖర్ ఫెయిల్ అయ్యాడు.

సినిమా అంతా నాటకీయత.. సినిమాలో సీన్లతో ప్రేక్షకుడు ఎక్కగా కనెక్ట్ కాలేదు. కథగా చూసుకుంటే శాకుంతలంలో ఆసక్తికరమైన మలుపులు ఉన్నా తెరపై చూస్తున్నప్పుడు అవి ఏమాత్రం ఎగ్జాక్ట్ చేయవు. సన్నివేశాలతో పాటు సంభాషణలు సైతం మరీ నాటకీయ‌కంగా ఉండడంతో చాలాచోట్ల ప్రేక్షకుల సహనానికి పరీక్ష తప్పదు. మొత్తంగా శకుంతలం ఒక పెద్ద మిస్ఫైర్ అనటంలో సందేహం లేదు.

ఫైన‌ల్ పంచ్‌: శాకుంత‌లంలో దృశ్య‌కావ్యం.. అదృశ్యం

శాకుంత‌లం TL రేటింగ్ : 2 / 5

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news