MoviesTL రివ్యూ: రంగ‌మార్తాండ‌… ప్ర‌తి ఒక్క‌రు మ‌న‌స్సును హ‌త్తుకునే సినిమా..!

TL రివ్యూ: రంగ‌మార్తాండ‌… ప్ర‌తి ఒక్క‌రు మ‌న‌స్సును హ‌త్తుకునే సినిమా..!

టైటిల్‌: రంగ‌మార్తాండ‌
న‌టీన‌టులు: ప్ర‌కాష్‌రాజ్‌, బ్ర‌హ్మానందం, ర‌మ్య‌కృష్ణ‌, శివాత్మిక‌, అన‌సూయ‌, రాహుల్ సిప్లిగంజ్ త‌దిత‌రులు
సినిమాటోగ్ర‌ఫీ: రాజ్ కె. న‌ల్లి
మ్యూజిక్‌: ఇళ‌య‌రాజా
నిర్మాత‌లు: కాలిపు మ‌ధు, ఎస్‌. వెంక‌ట‌రెడ్డి
క‌థ‌, ద‌ర్శ‌క‌త్వం: కృష్ణ‌వంశీ
రిలీజ్ డేట్ : 22 మార్చి, 2023

క్రియేటివ్ డైరెక్ట‌ర్ కృష్ణ‌వంశీ నుంచి సినిమా వ‌చ్చి చాలా కాలం అవుతోంది. ఎప్పుడో 2017లో వ‌చ్చిన న‌క్ష‌త్రం త‌ర్వాత మ‌ళ్లీ సినిమా రాలేదు. ఇక గ‌త కొన్నేళ్ల‌లో ఆయ‌న తీసిన సినిమాలు అన్నీ అట్ట‌ర్‌ప్లాప్ అవుతున్నాయి. ఇక ఇప్పుడు మ‌రాఠాలో హిట్ అయిన న‌ట‌సామ్రాట్ సినిమాకు రీమేక్‌గా రంగ‌మార్తాండ తెర‌కెక్కించారు. ఇది కూడా చాలా కాలంగా షూటింగ్ జ‌రుపుకుని విడుద‌ల‌కు నోచుకోలేదు. ఎట్ట‌కేల‌కు మైత్రీ వాళ్లు ఈ సినిమా పంపిణీ బాధ్య‌త‌లు తీసుకున్నారు. కాస్తో కూస్తో మంచి అంచ‌నాల‌తో పాటు ప్రీమియ‌ర్లు ప‌డ‌డంతో హైప్ వ‌చ్చింది. మ‌రి రంగ‌మార్తాండ‌తో అయినా కృష్ణ‌వంశీ ఫామ్‌లోకి వ‌చ్చాడా ? లేదా ? అన్న‌ది చూద్దాం.

స్టోరీ :
రంగమార్తాండ ( ప్రకాష్ రాజ్ ) ఆయన ఒక ప్రఖ్యాత రంగస్థలం నటుడు. రంగమార్తాండ ఆయన భార్య శ్రీమతి రాజుగారు ( రమ్యకృష్ణ ) కనిపించకుండా పోయారని వారి కుటుంబ సభ్యులు వెతుకుతూ ఉంటారు. వాళ్ళ కుమారుడు రంగారావు ( ఆదర్శ్‌ బాలకృష్ణ ) కోడలు గీతా రంగారావు ( అనసూయ ) , కూతురు శ్రీ ( శివాత్మిక ) అల్లుడు రాహుల్ ( రాహుల్ సిప్లిగం) టెన్షన్ పడుతూ ఉంటారు. అయితే రంగమార్తాండ ఒక దాబాలో సర్వీస్ మెన్ గా పనిచేస్తూ ఉంటాడు. అదే సమయంలో నాటక రంగానికి వేదికగా ఉన్న కళాభారతిలో పెద్ద అగ్ని ప్రమాదం జరుగుతుంది అన్న వార్త చూసి రంగమార్తాండ తల్లడిల్లిపోతాడు. వెంటనే ఆ కళాభారతికి వెళతాడు. ఈ క్రమంలోనే అప్పుడే హీరోగా పరిచయం అవుతున్న న‌టుడు ( అలీ రాజా ) కారులో ఎక్కుతాడు.

అక్కడ ఖాళీ బూడిదైపోయిన కళాభారతిని చూసి తన గతాన్ని గుర్తు చేసుకొని ఆవేదన చెందుతాడు. ఇక కళారంగంలో తాను చేసిన సేవలకు గుర్తింపుగా రంగమార్తాండ బిరుదుతో పాటు… బంగారు కంకణంతో సత్కరించిన రోజునే నటనకు రిటైర్మెంట్ ప్రకటించి తన కుటుంబంతో సంతోషంగా ఉండాలనుకుంటాడు. ఆస్తులన్నింటినీ కొడుకు, కూతురికి పంచేస్తాడు. ఈ క్రమంలోనే రంగమార్తాండకు కోడలితో గొడవలు ప్రారంభమవుతాయి. ఆ తర్వాత కూతురు ఇంటికి వెళితే కూతురు ఏకంగా దొంగ అనే నెపం వేస్తుంది. దీంతో తట్టుకోలేకపోయిన రంగమార్తాండ తన భార్య రాజుగారితో క‌లిసి సొంత ఊరికి వెళ్ళిపోతారు. అక్కడ ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి రంగమార్తాండ దాబాలో ఎందుకు ?పనిచేస్తున్నాడు ఈ క్రమంలోనే ఆయన స్నేహితుడు సుబ్బు ( బ్రహ్మానందం ) తో ఉన్న అనుబంధం ఏంటి చివరికి ఆయన ప్రయాణం ఎలా ? సాగింది నాటక రంగంలో నటించిన వారు నిజ జీవితంలో నటించాల్సి వస్తే ఎలాంటి పరిస్థితులు ? ఎదురవుతాయి అన్నదే ఈ సినిమా కథ.

విశ్లేష‌ణ :
సినిమా విశ్లేషణ విషయానికి వస్తే కృష్ణవంశీ మంచి లైన్‌ తీసుకున్నాడు. అయితే సినిమా మొత్తం ఫ్యామిలీ డ్రామాగా.. హ్యూమన్ ఎమోషన్లతో బంధాలు అనుబంధాలు నేపథ్యంలోనే సాగుతుంది. ఈ తరం పిల్లలు కూతుళ్లు, కొడుకులు, అల్లుళ్ళు, కోడళ్ళు తమ తల్లిదండ్రులను ఎలా చూసుకుంటున్నారు.. అలాగే మూడు తరాల మనస్తత్వాలు… ఒకరి వల్ల ఒకరు ఎలా ? ఇబ్బంది పడుతున్నారు అని అంశాలను దర్శకుడు కృష్ణవంశీ బాగా చూపించారు. అలాగే డబ్బు వల్ల ఎలాంటి గొడవలు జరుగుతాయి.. డబ్బు ప్రభావం మనుషులపై ఎలా ఉంటుంది అన్నది కూడా ఆయన చక్కగా చూపించారు.

కుటుంబంలో అందరూ వ‌దిలేస్తే ఏకాకిగా ఉండిపోయే తల్లిదండ్రుల జీవితాలు.. వారిలో కలిగే మానసిక సంఘర్షణను కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఇంకా చెప్పాలంటే ప్రస్తుత సమాజాన్ని కళ్ళకు కట్టినట్టు తెరపై ఆవిష్కరించాడు కృష్ణవంశీ. నాటకాలకు సంబంధించి స్టేజిపై ఎన్నో పాత్రలలో నటించి ఆ పాత్రలకు జీవం పోసిన వారు… నిజ జీవితంలో నటించలేక.. తమకు కలిగే ఎమోషన్లను కంట్రోల్ చేసుకోలేక ఎలాంటి ? ఇబ్బందులు పడ్డారు అనేది అద్భుతంగా వెండితెరపై ఆవిష్కరించాడు.

ముఖ్యంగా బ్రహ్మానందం పాత్రలో సంఘర్షణ, భార్య హఠాన్మరణంతో ఒంటరి బతుకు బతకలేక చివరి దశలో ఆయన పడే బాధ, వేదన ప్రేక్షకులకు కళ్ళల్లో నీళ్లు తెప్పిస్తాయి. బ్రహ్మానందంలోని మరోకోణాన్ని ఈ సినిమా చక్కగా ఆవిష్కరింపజేసింది. ఫ్యామిలీ ఎమోషన్లతో సినిమా ఆద్యంతం బాగున్నా.. కొంత స్లో నరేషన్ వల్ల బోరు కూడా కొడుతుంది. సినిమా ఫస్ట్ ఆఫ్ లో రంగమార్తాండకు కోడలితో జరిగే గొడవలు… ఇంటర్వెల్లో ట్విస్ట్‌ తర్వాత కూతురుతో వచ్చే మనస్పర్ధలు చూపించాడు. సెకండ్ ఆఫ్ మరింత స్లోగా నడుస్తూ కాస్త విసుగు కూడా తెప్పిస్తుంది.

అయితే మధ్య మధ్యలో వచ్చే ఎమోషన్ సన్నివేశాలు కన్నీళ్లు పెట్టిస్తాయి. మనం తెరమీద మన జీవితాన్ని చూస్తున్నట్టు కూడా ఉంటుంది. కథగా చూస్తే ఈ సినిమా రెగ్యులర్ ఫార్మాట్లోనే ఉంది. మనసుని హత్తుకునేలా ఆలోచింపజేసేలా.. హృదయం బరువెక్కేలా ఈ కథను వెండితెరపై ఆవిష్కరింప చేయడంలో బాగా సక్సెస్ అయ్యారు. తెరమీద ఆయా పాత్రలు పడే బాధ ప్రేక్షకులందరికీ కన్నీళ్లు తెప్పిస్తుంది. సినిమాలో ప్రతి డైలాగ్ అద్భుతంగా ఉంటుంది. ఏదేమైనా ఫ్యామిలీ ఎమోషన్స్ తో సాగే రోలర్ కోస్టర్ గా రంగమార్తాండ చరిత్రలో నిలిచిపోతుంది.

న‌టీన‌టుల పెర్పామెన్స్ :
ప్రకాష్ రాజ్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎలాంటి పాత్రలో అయినా జీవించే ప్రకాష్ రాజ్‌కు రంగమార్తాండ రాఘవరావు పాత్రలో పరకాయ ప్రవేశం చేసి జీవించేశాడు. ప్రకాష్ రాజ్‌ ప్రతి సీన్లోను ప్రాణం పెట్టి పనిచేశాడు. ఈ సినిమాకు మరో సర్ప్రైజింగ్ క్యారెక్టర్ బ్రహ్మానందం. చక్రీ పాత్రలో ఆయన కెరీర్ లోనే ది బెస్ట్ ఫర్ఫార్మెన్స్ ఇచ్చేసాడు. ఈ సినిమా తర్వాత దర్శక, నిర్మాతలు బ్రహ్మానందంను చూసే కోణం కచ్చితంగా మారుతుంది. అంత గొప్పగా బ్రహ్మానందం నటన ఉంది. ఆసుపత్రి సీన్లు అయితే బ్రహ్మానందం ఏకంగా ప్రకాష్ రాజును పూర్తిగా డామినేట్ చేసేసాడు.

రాఘవరావు భార్యగా రమ్యకృష్ణ నటన అద్భుతం. రమ్యకృష్ణ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కళ్ళతోనే అద్భుతమైన హావాభావాలు పలికించేసింది. ఇక శివాత్మిక, అనసూయ, ఆదర్శ్, రాహుల్ సిప్లిగంజ్ తమ పాత్రల వరకు బాగా నటించారు. శివాత్మిక కూడా నటనతో ఫిదా చేసింది. కెరీర్ ప్రారంభంలోనే ఆమెకు ఇంత మంచి పాత్ర రావడం.. అంత గొప్పగా నటించడం సూపర్ అని చెప్పాలి.

టెక్నిక‌ల్ డిపార్ట్‌మెంట్ ఎన‌లైజింగ్ :
మ్యూజిక్‌ మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం సినిమాకి పెద్ద ఎస్సెట్‌. పాట‌ల‌తో పాటు నేప‌థ్య సంగీతం అదిరిపోయింది. అస‌లు కొన్ని సీన్ల‌కు నేప‌థ్య సంగీతం లేక‌పోవ‌డం కూడా హైలెట్ అయ్యింది. ఆకెళ్ల శ్రీనివాస్ మాట‌లు కూడా చాలా బ‌లంగా నిలిచాయి. రాజ్ కె.. న‌ల్లి సినిమాటోగ్ర‌ఫీ సినిమాకు త‌గిన‌ట్టుగా ఉంది. నిర్మాత‌లు రాజీప‌డ‌లేదు. ద‌ర్శ‌కుడు కృష్ణ‌వంశీ త‌న‌ను తాను కొత్త‌గా ఆవిష్క‌రించుకునేందుకు ఈ సినిమాకు ఎంతో యూజ్ అయ్యింది. మాకు ద‌క్కిన అవార్డులు, రివార్డుల కంటే ఎఫైర్లే ఎక్కువ అని నేటి సినిమా న‌టుల జీవితం గురించి అంత న‌గ్నంగా చెప్ప‌డం మామూలు మ్యాట‌ర్ కాదు. ఏదేమైనా కృష్ణ‌వంశీ ఈ సినిమాను ఇంత ఎమోష‌న‌ల్‌, హార్ట్ ట‌చ్చింగ్‌గా చెప్ప‌డం గొప్ప విషయం. అయితే దీనిని కాస్త ఎంట‌ర్టైనింగ్ వేలో చెపితే ఇంకా బాగుండేది. అలాగే నేటి యూత్‌కు కావాల్సిన మ‌రిన్ని అంశాలు జోడించాల్సింది.

ఫైన‌ల్‌గా…
ప్ర‌తి వారం వ‌చ్చి వెళ్లిపోయే సినిమా కాదు రంగ‌మార్తాండ‌.. ప్ర‌తి ఒక్క‌రి మ‌న‌స్సుల‌ను హ‌త్తుకునే సినిమా..

రంగ‌మార్తాండ రేటింగ్ : 3/ 5

Latest news