MoviesTL స‌మీక్ష‌: ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం

TL స‌మీక్ష‌: ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం

అల్లరి నరేష్ – ఆనంది జంట‌గా తెర‌కెక్కిన సినిమా ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం. ఏఆర్ మోహన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఈ రోజు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. గ‌త కొంత కాలంగా స‌రైన హిట్ లేని న‌రేష్ ఈ సినిమాతో అయినా హిట్ ట్రాక్ ఎక్కాడో లేదో చూద్దాం.

క‌థ‌:
తెలుగు టీచర్‌ శ్రీనివాస్ (నరేష్ ) ఎన్నిక‌ల విధుల్లో భాగంగా ఓ మారుమూల గిరిజ‌న ప్రాంతం అయిన మారేడుమిల్లి వెళ‌తాడు. అప్ప‌టికే ప్ర‌భుత్వంపై కోపంతో ఉన్న గిరిజ‌నులు, అక్క‌డ ప్ర‌జ‌లు శ్రీనివాస్‌కు స‌హాయ నిరాక‌ర‌ణ చేస్తారు. అయితే అక్క‌డ ఉండే ల‌క్ష్మి ( ఆనంది) మాత్ర‌మే శ్రీనివాస్‌కు సాయం చేస్తూ ఉంటుంది. అక్క‌డ ప్ర‌జ‌ల అమాయ‌క‌త్వంతో పాటు వారి ఇబ్బందులు చూసిన శ్రీనివాస్ వారి త‌ర‌పున పోరాటం చేయాల‌ని అనుకుంటాడు ? ఈ క్ర‌మంలో అత‌డు ఏం చేశాడు ? వారి త‌ర‌పున ఎలాంటి పోరాటం చేశాడు ? ఈ ప్ర‌యాణంలో ఆనందితో అత‌డి ప్ర‌యాణం ఎలా సాగింది ? అన్న‌దే ఈ సినిమా స్టోరీ.

 

విశ్లేష‌ణ :
ఎంతో వెన‌క‌ప‌డిన గిరిజ‌నులు, అటు వారిని ప‌ట్టించుకోని అధికారులు మ‌రోవైపు వీరి మ‌ధ్య జ‌రిగిన సంఘ‌ర్ష‌ణే ఈ సినిమా. ఈ ఆధునియ యుగంలో కూడా వెన‌క‌ప‌డిన గిరిజ‌నుల పూర్తి అమాయ‌క‌పు పాత్ర‌లు రాసుకుని వారి స‌మ‌స్య‌ల‌పై తీసిన ద‌ర్శ‌కుడు ఏఆర్‌. మెహ‌న్‌ను మెచ్చుకోవాలి. టీచ‌ర్ పాత్ర‌లో న‌రేష్ త‌న పాత్ర‌కు పూర్తి న్యాయం చేశాడు. హీరోయిన్ ఆనంది గ్లామ‌ర్‌తో పాటు న‌ట‌న‌కు ప్రాధాన్యం ఉన్న పాత్ర‌లో న‌టించింది. ఇంగ్లీష్ టీచ‌ర్‌గా వెన్నెల కిషోర్ ఆక‌ట్టుకున్నాడు. మిగిలిన న‌టులు కూడా ఓకే.

సెకండాఫ్‌లో మోహ‌న్ భావోద్వేగ స‌న్నివేశాల‌ను బాగా డీల్ చేశాడు. మంచి క‌థ అయినా ఆ లైన్ పూర్తి స్థాయిలో ఆక‌ట్టుకునేలా లేదు. అధికారులు, ప్ర‌జ‌ల మ‌ధ్య వ‌చ్చే సీన్లు, సంఘ‌ర్ష‌ణ సాగ‌దీసిన‌ట్టుగా ఉంది. వెన‌క‌బ‌డిన ప్రాంతాల అభివృద్ధి, స‌మ‌స్య‌లు బాగానే ఎలివేట్ చేసినా.. ద‌ర్శ‌కుడు హీరో, హీరోయిన్ల మ‌ధ్య ల‌వ్‌ట్రాక్ స‌రిగా వాడుకోలేదు. ఫారెస్ట్ నేటివిటి ఎక్కువుగా ఉన్నా అందులో డెప్త్ మిస్ అయ్యింది.

సెకండాఫ్‌లో ల్యాగ్ సీన్లు కుదించిన‌ట్ల‌యితే ఇంకా బాగుండేది. క‌థ‌కు అవ‌స‌రం లేని కొన్ని కామెడీ సీన్లు ఎడిట్ చేయాల్సింది. నేప‌థ్య సంగీతం బాగుంది. పాట‌లు ఓకే. సినిమాలో చాలాసీన్లు రియ‌లిస్టిక్‌గా చూపించారు. ఎడిటింగ్ ఓకే.. అయితే కొన్ని సాగ‌దీత సీన్లు ట్రిమ్ చేయాల్సి ఉంది. నిర్మాణ విలువ‌లు బాగున్నాయి.

ఫైన‌ల్‌గా ఎమోషనల్ సోషల్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాలో కొన్ని ఎలిమెంట్స్‌తో పాటు క్లైమాక్స్, ఎమోష‌న‌ల సీన్లు బాగున్నాయి. అయితే ఇంట్ర‌స్టింగ్‌గా లేని ట్రీట్‌మెంట్‌, బోరింగ్ క‌థ‌నం, స్లో నెరేష‌న్ మైన‌స్‌. ఓవ‌రాల్‌గా చాలా సినిమాల త‌ర్వాత అల్ల‌రి న‌రేష్ కెరీర్‌లో ఈ సినిమా యావ‌రేజ్ సినిమాగా నిలుస్తుంది. మ‌రి బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్లు ఎలా ఉంటాయో ? చూడాలి.

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం రేటింగ్‌: 2.5 / 5

Latest news