Moviesచిన్న ప‌ల్లెటూర్లో సింహాద్రి 175 రోజులు... ఎప్ప‌ట‌కీ చెక్కు చెద‌ర‌ని ఎన్టీఆర్...

చిన్న ప‌ల్లెటూర్లో సింహాద్రి 175 రోజులు… ఎప్ప‌ట‌కీ చెక్కు చెద‌ర‌ని ఎన్టీఆర్ గొప్ప రికార్డు

అదో చిన్న ప‌ల్లెటూరు… అలాంటి ప‌ల్లెటూర్లో ఉన్న‌దే ఒక్క థియేట‌ర్‌. అది ఏ సెంట‌రో, బీ సెంట‌రో కాదు.. సీ సెంట‌ర్ కాదు ఏ డీ సెంట‌రో అనుకోవాలి. అప్ప‌టి వ‌ర‌కు ఆ ఊరు చరిత్ర‌లో ఒక్క సినిమా కూడా రిలీజ్ లేదు. అలాంటి చోట రిలీజ్ అయిన ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అవ్వ‌డ‌మే ఆ ఊరోళ్ల‌కు పెద్ద పండ‌గ‌. అలాంటిది అక్క‌డ ఎన్టీఆర్ సినిమా 50 – 100 రోజులు దాటేసి ఏకంగా 175 రోజులు ఆడేసింది. నాటి నుంచి నేటి వ‌ర‌కు ఆ ఊరు చ‌రిత్ర‌లో 100 రోజులు ఆడిన సినిమాయే లేద‌నుకుంటే.. ఇక 175 రోజుల రికార్డును ట‌చ్ చేసే సినిమా మాత్రం ఎలా ఉంటుంది ?

ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా న‌ల్ల‌జ‌ర్ల మండలంలోని అనంత‌ప‌ల్లి ఓ మేజ‌ర్ పంచాయ‌తి. అక్క‌డ అన్న‌పూర్ణ పిక్చ‌ర్ ప్యాలెస్ ఉంది. ఏలూరు – కొవ్వూరు ప్ర‌ధాన ర‌హ‌దారికి ఆనుకునే ఈ థియేట‌ర్ ఉంటుంది. అనంత‌ప‌ల్లిలో ఎన్టీఆర్ న‌టించిన సింహాద్రి సినిమా తొలిసారిగా రిలీజ్ అయ్యింది. అప్ప‌టికే ప‌ల్లెల్లో ఎన్టీఆర్‌కు భారీ సంఖ్య‌లో అభిమానులు, అభిమాన సంఘాలు పుట్టుకు వ‌చ్చేశాయి. స్టూడెంట్ నెంబ‌ర్ వ‌న్‌, ఆది, అల్ల‌రి రాముడు లాంటి హిట్లు ఎన్టీఆర్ ఖాతాలో ప‌డ‌డంతో మాస్‌కు బాగా ద‌గ్గ‌రైపోయాడు.

ఈ క్ర‌మంలోనే 2003లో రిలీజ్ అయిన సింహాద్రికి ఒక రోజు ముందు విక్ట‌రీ వెంక‌టేష్ న‌టించిన వ‌సంతం రిలీజ్ అయ్యింది. కోలీవుడ్‌లో హిట్ అయిన సినిమాకు రీమేక్‌గా వ‌చ్చిన ఈ సినిమాకు ఒరిజిన‌ల్ డైరెక్ట‌ర్ విక్ర‌మ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమా క్లాస్ ఆడియెన్స్‌ను ఆక‌ట్టుకుంది. ఆ మ‌రుస‌టి రోజు రిలీజ్ అయిన సింహాద్రికి తొలి ఆట‌కే బ్లాక్‌బ‌స్ట‌ర్ టాక్ వ‌చ్చేసింది. ఏకంగా 155 సెంట‌ర్ల‌లో 100 రోజులు ఆడింది. అప్ప‌టి వ‌ర‌కు తెలుగు సినిమా చ‌రిత్ర‌లో ఉన్న రికార్డులు అన్నింటికి సింహాద్రి పాత‌రేసేసింది.

అనంత‌ప‌ల్లి లాంటి ప‌ల్లెటూర్లో ఆ సినిమా చూడ‌డానికి చుట్టు ప‌క్క‌ల కొన్ని మండ‌లాల నుంచి బ‌ళ్లు వేసుకుని మ‌రీ అమ్మ‌మ్మ‌లు, నాన‌మ్మ‌లు ఈ సినిమా చూడ‌డానికి వ‌చ్చేవారు. అప్ప‌ట‌కి కొన్ని సంవ‌త్స‌రాల క్రిత‌మే ఈ సంస్కృతి పోయింది. మ‌ళ్లీ ఆంధ్రా, తెలంగాణ వ్యాప్తంగా సింహాద్రి సినిమా చూసేందుకు బ‌ళ్లు వేసుకుని మ‌రీ ఆ థియేట‌ర్లు ఆడుతోన్న సినిమా థియేట‌ర్ల‌కు వ‌చ్చేవారు. ఎడ్ల బండ్లు, ట్రాక్ట‌ర్ల‌తో మ్యాట్నీ, సెకండ్ షోలు చూడ‌డం అప్ప‌ట్లో ప‌ల్లెల్లో ఎక్కువుగా జ‌రిగిదే.

మ‌ళ్లీ ఇన్నేళ్ల‌కు బాల‌య్య అఖండ సినిమాతో ఈ మ్యాజిక్ రిపీట్ చేశాడు. ఇక అప్ప‌ట్లో అనంత‌ప‌ల్లి అన్న‌పూర్ణ ప్యాలెస్‌లో 50 రోజులు ఆడ‌డ‌మే సింహాద్రి గొప్ప అనుకున్నారు. అలాంటిది సెంచ‌రీ కొట్టిన ఆ సినిమా చివ‌ర‌కు 150 రోజులు దాటేసి.. 175 రోజులు ఆడింది. ఏలూరు ఉషా పిక్చ‌ర్స్ ద్వారా జిల్లాలో సింహాద్రి రిలీజ్ అయ్యింది. ఈ చిన్న ప‌ల్లెటూర్లో సినిమా రిలీజ్ చేస్తే చూడ‌డానికి జ‌నాలు వ‌స్తారా ? కనీసం ప‌ట్టుమ‌ని నెల రోజులు అయినా ఆడుతుందా ? అన్న సందేహంతోనే అక్క‌డ రిలీజ్ చేశారు.

చివ‌ర‌కు సినిమా ఇర‌గ‌దీసేసింది. విచిత్రం ఏంటంటే తాడేప‌ల్లిగూడెంలో టిక్కెట్లు దొర‌క‌ని వాళ్లంతా ఇక్క‌డ‌కు వ‌చ్చి మ‌రీ సినిమా చూసేవారు. తాడేప‌ల్లిగూడెం, దేవ‌ర‌ప‌ల్లి, భీమ‌డోలు, న‌ల్ల‌జ‌ర్ల ప్రాంతాల క‌ళాశాల విద్యార్థులు అంద‌రూ ఒక‌టికి రెండు మూడు సార్లు సింహాద్రిని ఇదే థియేట‌ర్లో చూసి ఎంజాయ్ చేసేవారు. ఇక క్యూబ్ సిస్ట‌మ్ వ‌చ్చాక ఇప్పుడు అనంత‌ప‌ల్లి మాత్ర‌మే కాదు చిన్న ప‌ల్లెటూర్ల‌లో అన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నా.. అనంత‌ప‌ల్లి చ‌రిత్ర‌లో సింహాద్రి రికార్డు ఎప్ప‌ట‌కీ అలా చెక్కు చెద‌ర‌కుండా ఉండిపోయింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news