Moviesవెంక‌టేష్ బొబ్బిలిరాజా సినిమా వెన‌క ఇన్ని ట్విస్టులు ఉన్నాయా...!

వెంక‌టేష్ బొబ్బిలిరాజా సినిమా వెన‌క ఇన్ని ట్విస్టులు ఉన్నాయా…!

తెలుగు సినిమా చరిత్రలో సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ ది అప్రతిహత ప్రస్థానం. భారతదేశంలో ఉన్న అన్ని భాషల్లోనూ సినిమాలు నిర్మించిన ఘనత ఈ బ్యానర్ సొంతం. మూవీ మొగల్ గా నిర్మాత డి.రామానాయుడు కి మంచి పేరుంది. శతాధిక చిత్రాలను నిర్మించి ప్రపంచ రికార్డ్ సృష్టించిన రామానాయుడు వారసులుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు సురేష్ బాబు – వెంకటేష్. ఇందులో సురేష్ బాబు తెలుగు సినిమా రంగంలో తిరుగులేని అగ్ర నిర్మాతగా కొనసాగుతున్నారు. మరోవైపు వెంకటేష్ హీరోగా ఉన్నారు. వీరిద్దరికీ తిరుగులేని ఇమేజ్ తెచ్చిన ఘనత బొబ్బిలి రాజా సినిమాదే.

ఈ సినిమా ప‌ట్టాలెక్కేముందు జ‌రిగిన కొన్ని ఆస‌క్తిక‌ర విష‌యాలు తెలుసుకుందాం. సురేష్ బాబుకు చిన్నప్పటి నుంచే సినిమాలంటే ఆసక్తి ఉండడంతో తండ్రి రామానాయుడుతో కలిసి కథా చర్చల్లో పాల్గొనే వారట. నిర్మాతగా ఎలా రాణించాలని చిన్నప్పటి నుంచే తన తండ్రి దగ్గర పాఠాలు నేర్చుకున్నారు. ఇక అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం చేసిన వెంకటేష్ కలియుగ పాండవులు సినిమాతో టాలీవుడ్ హీరోగా పరిచయం అయ్యారు. వెంకటేష్ కు ఒక‌టి, రెండు హిట్ సినిమాలు వచ్చిన మాస్ ఇమేజ్ రాలేదు. అదే సమయంలో సురేష్ బాబు ప్రొడక్షన్ బాధ్యతలు తీసుకుని సినిమా చేసేందుకు సిద్ధమయ్యారు.

ఈ క్రమంలోనే వెంకటేష్ హీరోగా మంచి మాస్ కథ రెడీ చేసుకున్నారు సురేష్‌బాబు. బొబ్బిలి రాజా సినిమా కి పరుచూరి బ్ర‌ద‌ర్స్ కథను అందించగా… బి.గోపాల్ ను దర్శకుడిగా తీసుకున్నారు. జ‌యంత్ సహాయ దర్శకుడిగా పని చేశారు. ఈ సినిమాలో వెంకటేష్ కు అత్తగా వాణిశ్రీ పోషించిన రాజేశ్వరి దేవి పాత్రకు ముందుగా మరో సీనియర్ నటి శారదను తీసుకోవాలని అనుకున్నారట. అయితే అప్పటికే శార‌ద అలాంటి పాత్రలు చాలా చేసి ఉండడంతో సురేష్‌బాబు సూచన మేరకే కొత్తగా ఉంటుందని వాణిశ్రీని తీసుకున్నారట.

ఇక హీరోయిన్ గా ముందుగా వెంకటేష్ పక్కన రాధను అనుకున్నారు. అయితే రచయిత గోపాలకృష్ణ రాధ అప్పటికే చాలా సినిమాల్లో చేసి ఉందని… కొత్త అమ్మాయిని తీసుకుంటే బాగుంటుంది అని చెప్పడంతో అప్పుడు బాలీవుడ్లో ఒక వెలుగు వెలుగుతున్న దివ్యభారతి తీసుకున్నారు. ఈ సినిమాతో టాలీవుడ్ లోకి దివ్య‌భార‌తి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. వెంకటేష్ విక్టరీ వెంకటేష్ గా మారడంతో పాటు తిరుగులేని మాస్ ఇమేజ్ తెచ్చిపెట్టింది. అటు నిర్మాతగా సురేష్ బాబుకి కూడా ఇదే మొదటి సినిమా. అలా అన్నదమ్ములిద్దరూ ఈ సినిమాతో తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news