బాహుబలే దిక్కంటున్న ప్రభాస్.. సాహో అంటోన్న ఫ్యాన్స్!

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ గతేడాది సాహో చిత్రంతో బాక్సాఫీస్ వద్ద సందడి చేశాడు. బాహుబలి వంటి విజువల్ వండర్ సినిమా తరువాత ప్రభాస్ నటించిన సినిమా కావడంతో ఈ సినిమా చూసేందుకు అటు సౌత్ ఇండియాతో పాటు బాలీవుడ్ జనాలు ఎగబడ్డారు. కానీ సినిమాలో అంత దమ్మున్న కంటెంట్ లేకపోవడంతో ఈ సినిమా అనుకున్నస్థాయిలో భారీ విజయాన్ని నమోదు చేయలేకపోయింది. ఈ సినిమా యావరేజ్ హిట్‌గా నిలవడంతో ప్రభాస్ తన నెక్ట్స్ మూవీ కోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో జిల్ ఫేం దర్శకుడు రాధాకృష్ణ డైరెక్షన్‌లో తన 20వ చిత్రాన్ని రెడీ చేసే పనిలో పడ్డాడు ప్రభాస్.

ఈ క్రమంలో ప్రభాస్ నటించబోయే సినిమాకు ‘జాన్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఈ సినిమాను తొలుత ఈ ఏడాదిలోనే రిలీజ్ చేయాలని భావించినా, సాహో ఫలితంతో ప్రభాస్ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. పీరియాడికల్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమా రిలీజ్‌ను వాయిదా వేసి వచ్చే ఏడాదిలో వేసవి కానుకగా రిలీజ్ చేయాలని ప్రభాస్ చూస్తున్నాడు. ఈ సినిమాను వాయిదా వేయడంలో ప్రభాస్ ఓ సెంటిమెంట్‌ను కూడా ఫాలో అవుతున్నాడనేది టాక్. ప్రభాస్‌ను ఇంటర్నేషనల్ స్టార్ చేసిన బాహుబలి చిత్రం వేసవి కానుకగా 2017 ఏప్రిల్ 28న రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఇదే సెంటిమెంట్‌ను మరోసారి రిపీట్ చేయాలని ప్రభాస్ భావిస్తున్నాడు.

యువి క్రియేషన్స్‌తో కలిసి రెబెల్ స్టార్ కృష్ణంరాజు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెత్‌తో తెరకెక్కించనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. కాగా ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే అంశాన్ని చిత్ర యూనిట్ ఇంకా రివీల్ చేయకపోవడం గమనార్హం. మరి బాహుబలి సెంటిమెంట్‌ ఈసారి ప్రభాస్‌కు ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో చూడాలి.

Leave a comment