Moviesమత్తు వదలరా మూవీ రివ్యూ & రేటింగ్

మత్తు వదలరా మూవీ రివ్యూ & రేటింగ్

టాలీవుడ్ దర్శకధీరుడుకు అన్నయ్య అయిన మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి కొడుకులలో కాల భైరవ ఇప్పటికే సింగర్‌గా తన సత్తా ఏమిటో చూపిస్తున్నాడు. అయితే మరో కొడుకు శ్రీసింహా ఎప్పటికైనా హీరో అవ్వాలనే కసితో తాజాగా నటించిన చిత్రం మత్తు వదలరు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ రిలీజ్ చేయడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమా అన్ని పనులు ముగుంచుకుని క్రిస్మస్ కానుకగా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

కథ:
బాబు(శ్రీసింహా) తన స్నేహితులు యేసు(సత్య) మరియు అభిలతో కలిసి డెలివరీ బాయ్‌లగా పనిచేస్తుంటారు. చాలీచాలని జీతంతో వారు నానా అవస్థలు పడుతుంటారు. అయితే యేసు వారి జీవితాలు మారిపోయే ఓ ఆలోచన చెబుతాడు. దీనికి వారిద్దరు కూడా ఓకే అని అది అమలు చేస్తారు. కానీ ఇక్కడే ఆ ముగ్గురు అనుకోని కష్టాల్లో పడతారు. ఇంతకీ యేసు చెప్పిన ప్లాన్ ఏమిటి? దీనికి మిగతా వారు ఎందుకు ఒప్పుకున్నారు? వారు ఎలాంటి కష్టాల్లో పడ్డారో? చివరకు వారి కష్టాల నుండి వారు ఎలా బయటపడతారు? అనేది సినిమా కథ.

విశ్లేషణ:
ఒక థ్రిల్లర్ సినిమాకు బోలెడంత కామెడీని యాడ్ చేసి సినిమాగా ప్రెజెంట్ చేస్తే ఆడియెన్స్ ఖచ్చితంగా ఆకట్టుకుంటారనే కాన్సెప్టును దర్శకుడు రితేష్ రానా బాగా ఆచరించాడు. ముగ్గురు స్నేహితులు, వారి అవసరాల కోసం పట్టే చెడుదారిలో వారు ఎలాంటి కష్టాలను కొనితెచ్చుకున్నారనే కాన్సెప్టును మనకు అద్భుతంగా చూపించాడు దర్శకుడు.

ఇక కథనం విషయానికి వస్తే.. ఫస్టాఫ్‌లో ఈ సినిమాలో బాబు, యేసు, అభి అనే ముగ్గురు స్నేహితులు మిగతావారిలా తమ జీవితాలను ఎంజాయ్ చేయాలని అనుకుంటారు. కానీ వారి వద్ద డబ్బు లేకపోవడంతో వారు ఒక రిస్క్ చేస్తారు. అయితే ఈ రిస్క్ వారి జీవితాలను అతలాకుతలం చేస్తుంది. బాబు ప్రేమించే అమ్మాయిని కూడా అతడి నుండి దూరం చేస్తుంది. ఇక్కడ వచ్చే ట్వస్ట్‌తో ఇంటర్వెల్ బ్యాంగ్ ఇచ్చాడు దర్శకుడు. హీరో, అతడి స్నేహితుల పరిచయాలు, హీరో-హీరోయిన్ల మధ్య రొమాంటిక్ ట్రాక్, కొన్ని సస్పెన్స్ థ్రిల్లర్ సన్నివేశాలతో దర్శకుడు ఫస్టాఫ్‌న నెట్టుకొచ్చాడు.

ఇక సెకండాఫ్‌లో తమను తాము ఈ ప్రమాదం నుండి హీరో అతడి స్నేహితులు ఎలా రక్షించుకున్నారు, వారికి హీరోయిన్ ఎలాంటి సాయం చేస్తుంది, చివరకు కథ ఏమవుతుంది అనే అంశాలతో ముగించేశాడు. చూడటానికి ఓ పాతచింతకాయ పచ్చడి సినిమా కథే అయినా రితేష్ రానా తెరకెక్కించిన విధానం మాత్రం సూపర్. అతడకు ఎంచుకున్న స్క్రీన్‌ప్లే సినిమాు చాలా బాగా కలిసొచ్చింది. ఓవరాల్‌గా ఈ సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులు ఆస్వాదిస్తారు.

నటీనటులు పర్ఫార్మెన్స్:
శ్రీ సింహా కొత్త హీరో అని ఈ సినిమా చూస్తన్నంత సేపు మనకు ఎక్కడా అనిపించదు. చాలా మెచ్యురిటీతో నటించిన ఈ హీరో మరిన్ని సినిమాల్లో అవకాశాలు దక్కించుకోవడం ఖాయమని అంటున్నారు చిత్ర వర్గాలు. ఇక హీరో ఫ్రెండ్స్‌ సత్య చాలా బాగా కామెడీ పండించాడు. మరో స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ కూడా ఈ సినిమాను ఒంటిచేత్తో లాక్కొచ్చాడు. మిగతా నటీనటులు వారి పరిధిమేర బాగా నటించారు.

టెక్నికల్ డిపార్ట్‌మెంట్:
దర్శకుడు రితేష్ రానా రాసుకున్న వినూత్న కథను అంతే వినూత్నంగా తెరకెకకించి శభాష్ అనిపించుకున్నాడు. యూత్‌ను టార్గెట్‌ చేస్తూనే ఓ మంచి సోషల్ మెసేజ్ ఈ సినిమాలో మనకు అందిస్తాడు. సినిమాటోగ్రఫీ సినిమాకు బాగా కలిసొచ్చింది. కాలభైరవ అందించిన మ్యూజిక్ సూపర్. ముఖ్యంగా కొన్ని చోట్ల బీజీఎం వర్క్ ఎక్సలెంట్‌గా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

చివరగా:
మత్తు వదలరా – కిక్కు దిగడం ఖాయం!

రేటింగ్:
3.25/5.0

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news