బెల్లంకొండ ‘ రాక్ష‌సుడు ‘ ప్రి రివ్యూ

టాలీవుడ్ అగ్ర నిర్మాత బెల్లంకొండ సురేష్ వారసుడిగా హీరోగా ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కెరీర్‌ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉంది. 2014లో స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో అల్లుడు శీను సినిమాతో హీరోగా ఎంట్రీ అయిన శ్రీనివాస్ ఆ తర్వాత బోయపాటి శీను దర్శకత్వంలో జ‌య‌ జానకి నాయక – శ్రీవాస్ దర్శకత్వంలో సాక్ష్యం లాంటి భారీ బడ్జెట్ సినిమాల్లో నటించినా కమర్షియల్ గా సరైన బ్రేక్ అందుకోలేకపోయాడు.

గత ఏడాది చివర్లో చేసిన కవచం – ఈ ఏడాది తేజ దర్శకత్వంలో నటించిన సీత సినిమాలు సైతం ప్లాప్ అయ్యాయి. తాజాగా శ్రీనివాస్ నటించిన రాక్షసుడు సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. కోలీవుడ్ లో హిట్ అయిన రాచ్చ‌స‌న్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా ఓ సైకో థ్రిల్ల‌ర్ కథాంశంతో తెరకెక్కింది. రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సాయి శ్రీనివాస్ – అనుపమ పరమేశ్వరన్ హీరో, హీరోయిన్లుగా నటించారు.

వ‌రుసగా ఫ్లాపులు అందుకుంటున్న బెల్లంకొండ సాయిశ్రీనివాస్, ఈ సినిమా విజయంపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఇతడి అదృష్టం ఏంటంటే.. గత సినిమాల్లానే ఇది కాస్ట్ ఫెయిల్యూర్ కాదు. తక్కువ బడ్జెట్ లో తీసి విడుదలకు ముందే టేబుల్ ప్రాఫిట్ అందుకున్నారు. ఎటొచ్చి హిట్ ఒక్కటే పెండింగ్. అదొక్కటే అందని ద్రాక్షగా మిగిలింది ఈ హీరోకి. ఈ సినిమాతో ఆ కోరిక తీర్చేసుకుంటాడ‌నే చాలా మంది భావిస్తున్నారు.

ఇక ఇప్ప‌టికే కోలీవుడ్ రాచ్చ‌స‌న్ సినిమాను ఆన్‌లైన్‌లో చూసిన వారంద‌రు సినిమా కంటెంట్ బాగుంద‌ని ప్ర‌శంసిస్తున్నారు. ఇక ఈ సినిమా మ‌న తెలుగు వాళ్ల‌కు క‌నెక్ట్ అయ్యి హిట్ అయితే చాలు బెల్లంకొండ‌కు కెరీర్‌లో తొలి క‌మ‌ర్షియ‌ల్ బ్రేక్ ల‌భించిన‌ట్లే అవుతుంది.

Leave a comment