వ‌ర్షం రాక‌పోతే సెమీస్‌లో ఇండియా ఓడిపోయేదా….

ప్రతిష్టాత్మక ప్రపంచకప్‌ సెమీఫైనల్‌ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో ఇప్పుడు ఫ‌లితం కోసం అంద‌రూ రిజ‌ర్వ్ డే వ‌ర‌కు వెయిట్ చేయ‌క‌త‌ప్ప‌లేదు. మంగ‌ళ‌వారం భార‌త్ – న్యూజిలాండ్ జ‌ట్ల మ‌ధ్య జ‌ర‌గాల్సిన మ్యాచ్ వ‌ర్షం కార‌ణంగా రిజ‌ర్వ్ డేకు వాయిదా ప‌డింది. న్యూజిలాండ్‌ మ్యాచ్‌ ఆగిపోయే సమయానికి 46.1 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. బుధ‌వారం మ్యాచ్ ఆగిన చోట నుంచే ప్రారంభ‌మ‌వుతుంది.

అయితే వ‌ర్షం ప‌లుమార్లు మ్యాచ్‌కు అంత‌రాయం క‌లిగించ‌డంతో భార‌త అభిమానుల‌ను టెన్ష‌న్ పెట్టేసింది. ఇందుకు కార‌ణం కూడా ఉంది. డక్‌వర్త్‌లూయిస్‌ పద్దతిలో భారత్‌ నిర్థేశించాల్సిన లక్ష్యాలను చూసి భారత అభిమానులు కొంత కలవరపాటుకు గురయ్యారు. అందువ‌ల్ల మంగ‌ళ‌వారం మ్యాచ్ ఆగిపోవ‌డ‌మే మంచిది అయ్యిందిన క్రికెట్ విశ్లేష‌కులు చెపుతున్నారు.

మంగ‌ళ‌వార‌మే మ్యాచ్ ఫ‌లితం తేలాలంటే మ్యాచ్‌ను 20 ఓవర్లకు కుదిస్తే టీమిండియా విజయానికి 148 పరుగులు చేయాల్సి వచ్చేది. అయితే 20 ఓవ‌ర్ల‌లో 148 ప‌రుగులు అంటే చేజింగ్ క‌ష్ట‌మే అయ్యేద‌ట‌. వ‌ర్షం తర్వాత పిచ్‌లో వచ్చే మార్పు, మబ్బు పట్టిన వాతావరణంలో కివీస్‌ బౌలర్లు స్వింగ్‌తో చెలరేగిపోయే ప్రమాదం ఉంద‌ని… న్యూజిలాండ్‌లో పాస్ట్‌, సీమ్ బౌల‌ర్లే ఎక్కువుగా ఉండ‌డంతో ఇంత త‌క్కువ స్కోర్ కూడా భార‌త చేధించ‌లేక‌పోయేద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డ్డారు.

ఇక పిచ్‌పై స్టార్టింగ్‌లో కీవీస్ కూడా చాలా ఇబ్బంది ప‌డింది. తొలి రెండు ఓవ‌ర్లు మెయిడెన్లు. 8వ ఓవ‌ర్‌కు కాని ఫోర్ లేదు. తొలి పవర్‌ప్లేలో ఒక వికెట్‌ కోల్పోయి కేవలం 27 పరుగులు మాత్రమే చేసింది. దీంతో పిచ్ స్వ‌భావం మారితే ఇక్క‌డ చేజింగ్ చేయ‌డం చాలా సంక్లిష్టం అని తెలుస్తోంది. 20 ఓవ‌ర్ల‌కు మ్యాచ్ కుదిస్తే భార‌త్ గెల‌వ‌డం అసాధ్య‌మే అయ్యేది. అందుకే మ్యాచ్ ఆగ‌డం భార‌త్‌కే మంచిదైంది.

Leave a comment