సుబ్రహ్మణ్యపురం ” రివ్యూ & రేటింగ్ “

చిత్రం: సుబ్రహ్మణ్యపురం
నటీనటులు: సుమంత్, ఇషా రెబ్బా, సురేష్, అమిత్ శర్మ, సాయి కుమార్ తదితరులు
మ్యూజిక్: శేఖర్ చంద్ర
నిర్మాత: బీరం సుధాకర్ రెడ్డి
దర్శకుడు: సంతోష్ జాగర్లమూడి

హీరో సుమంత్, ఇషా రెబ్బాలు జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘సుబ్రహ్మణ్యపురం’ మొదట్నుండీ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసింది. పూర్తి మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్‌ ఆ అంచనాలను మరింత పెంచింది. కొత్త దర్శకుడు సంతోష్ జాగర్లమూడి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. మరి ఈ సినిమా క్రియేట్ చేసిన అంచనాలను అందుకుందో లేదో రివ్యూలో చూద్దాం.

కథ:
‘సుబ్రహ్మణ్యపురం’ అనే ఊరిలో వరుసగా ఆత్మహత్యలు జరుగుతుంటాయి. ఇవి ఆత్మహత్యలా లేక హత్యలా అనే విషయాన్ని తెలుసుకునేందుకు నాస్తికుడైన కార్తీక్(సుమంత్) పరిశోధన చేపడుతాడు. ఈ హత్యలు ఎందుకు జరుగుతుంటాయి? వీటి వెనకాల ఎవరు ఉన్నారు? అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది? అనే విషయాలను సుమంత్ ఎలా కనిపెడతాడు అనేది మిగతా స్టోరీ.

విశ్లేషణ:
మిస్టరీ థ్రిల్లర్‌ సినిమాలకు తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరణ అందిస్తారు. ఈ సినిమా కూడా అదే కోవకు చెందడం.. నిఖిల్ నటించిన ‘కార్తికేయ’ చిత్రాన్ని పోలి ఉందనే భావన జనాల్లోకి బాగా వెళ్లడంతో ఈ సినిమా చూసేందుకు ఒక వర్గం ఆడియెన్స్ రెడీ అయిపోయారు. ఇక ఈ సినిమాలోకి వెళ్తే.. ఒక మిస్టరీ థ్రిల్లర్ సినిమాకు ఎలాంటి అంశాలు కావాలో అవన్నీ మనకు ఈ సినిమాలో కనిపిస్తాయి. కొత్త దర్శకుడు సంతోష్ జాగర్లమూడి చాలా కాన్ఫిడెంట్‌గా ఈ సినిమాను తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను అలరిస్తుంది. ఫస్ట్‌హాఫ్‌ మొత్తం వరుసగా జరుగుతున్న ఆత్మహత్యలు, సుబ్రహ్మణ్యపురంలో అసలు ఏం జరుగుతుందనే ఆసక్తి రేకెత్తిస్తుంది. నాస్తికుడైన రిసెర్చర్‌గా కార్తీక్(సుమంత్) ఈ విషయాలను లైట్‌గా తీసుకుంటాడు. అయితే ఇంటర్వెల్ బ్యాంగ్‌లో వచ్చే ట్విస్ట్‌తో సెకండాఫ్‌పై క్యూరియాసిటీ క్రియేట్ చేస్తుంది.

సెకండాఫ్‌లో కథ చాలా సీరియస్ మోడ్‌లోకి వెళ్తుంది. కార్తీక్ ఈ ఆత్మహత్యల వెనుక ఉన్న రహస్యాన్ని ఎలాగైనా తెలుసకోవడానికి సుబ్రహ్మణ్యపురంకు వెళతాడు. అక్కడ అతడు ఎదుర్కొనే సవాళ్లు.. వాటిని అతడు ఎలా పరిష్కరించాడు అనే కాన్సెప్ట్‌తో సినిమా ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్‌కు చేరుకుంటోంది. ఒక మంచి నోట్‌తో ఈ సినిమాకు శుభం కార్డు పడుతుంది.

ఓవరాల్‌గా చూస్తే ఒక మంచి మిస్టరీ థ్రిల్లర్‌గా ఈ సినిమాను తెరకెక్కించాం అంటూ సినిమా యూనిట్ కాన్ఫిడెంట్‌గా చెప్పగా, సినిమా చూస్తే అది నిజం అని మనకు అర్ధం అవుతుంది. ఇక ఈ సినిమాతో సుమంత్ మరో మంచి సినిమాను ప్రేక్షకులకు అందించడంలో సక్సెస్ అయ్యాడు.

నటీనటులు పర్ఫార్మెన్స్:
మిస్టరీలను చేధించే రిసెర్చర్‌గా సుమంత్ యాక్టింగ్ బాగుంది. తనకు ఛాలెంజ్ విసిరే ప్రతి అంశాన్ని చాలా చక్కగా పరిష్కరించాడు సుమంత్. హీరోయిన్ ఈషా రెబ్బా పాత్రకు ఇందులో పెద్దగా స్కోప్ లేదు. కేవలం హీరోయిన్ ఉండాలి కాబట్టి ఆమె ఉన్నట్లు మనకు అనిపిస్తుంది. పోలీస్ ఆఫీసర్ పాత్రలో అమిత్ శర్మ బాగా నటించాడు. సాయి కుమార్, సురేష్ తదితరులు తమ పాత్రల మేర మెప్పించారు.

టెక్నికల్ డిపార్ట్‌మెంట్:
సంతోష్ జాగర్లమూడి తన తొలి సినిమానే చాలా ఛాలెంజింగ్‌గా తీసుకుని అంతే చక్కగా తెరకెక్కించాడు. మిస్టరీ థ్రిల్లర్‌లో ఉండాల్సిన అంశాలను పర్ఫెక్ట్‌గా డెలివర్ చేశాడు ఈ డైరెక్టర్. అయితే కొన్ని సీన్స్ బాగా లాగదీసినట్లు ఉండటంతో సినిమాపై ఆసక్తి తగ్గుతుంది. ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ సీన్స్ అనుకున్న స్థాయిలో ఎలివేట్ చేయలేకపోయాడు. సినిమాటోగ్రఫీ సినిమాకు బాగా కలిసొచ్చింది. గ్రాఫిక్స్ పరంగా కూడా సినిమా బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. శేఖర్ చంద్ర మ్యూజిక్ సినిమాకు పెద్ద బూస్ట్ ఇచ్చింది.

చివరగా:
సుబ్రహ్మణ్యపురంలో మిస్టరీ పెద్దగా లేదండోయ్!

రేటింగ్: 2.5/5

Leave a comment