నాని హరికృష్ణ భేటీ వెనుక అసలు రహస్యం..!

ఒకప్పుడు టీడీపీలో కీలక భూమి పోషించిన కొడాలి నాని తర్వాత వైసీపీలోకి వెళ్లారు. అయితే కొడాలి నాని, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. కొడాలి నాని స్వతహాగా ఎన్టీఆర్ వీరాభిమాని అని అందరికీ తెలుసు. గతంలో ఓ వైసీపీ ఫ్లెక్సీలో ఎన్టీఆర్ ఫోటో వాడిన విషయం సంచలనం సృష్టించింది. అయితే ఫ్లెక్సీలపై ఎన్టీఆర్ ఫోటోతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. తాజాగా కొడాలి నాని పేరుతో ఉన్న ఫేస్‌బుక్‌ అకౌంట్‌లో పోస్ట్ చేసిన ఓ ఫొటో ఇప్పుడు నెట్‌లో హల్‌చల్ చేస్తోంది.

సోషల్ మీడియాలో వచ్చినప్పటి నుంచి ప్రతి చిన్న విషయం కూడా వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ ఫొటో ఎప్పటిదో తెలియదు.. సందర్భం ఏంటో తెలియదు… హరికృష్ణ ముందు కొడాలి నాని వినయంగా చేతులు కట్టుకుని నిల్చుని ఉన్న ఫొటో అది. ఇంకేముంది, హరికృష్ణ వైసీపీలో చేరబోతున్నారంటూ కొన్ని వెబ్‌సైట్లు, యూట్యూబ్ చానల్స్ దుష్ర్పచారానికి తెరలేపాయి. మరోవైపు హరికృష్ణ ఆయన తనయులు టీడీపీ కి అంటీ ముట్టనట్టు తిరగడం..త్వరలో హరికృష్ణ వైసీపీ తీర్థం పుచ్చుకుంటున్నారని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.

ఇంకొందరైతే.. ఏకంగా పార్టీ టికెట్‌పై హరికృష్ణకు జగన్ హామీ ఇచ్చారని.. జూనియర్ ఎన్టీఆర్ కూడా తండ్రి తరపున ప్రచారం చేస్తాడని ఇష్టమొచ్చిన రీతిలో వార్తలు రాశారు. దాంతో కొడాలి నాని పేరుతో ఉన్న ఫేస్‌బుక్‌ అకౌంట్‌లో పోస్ట్ చేసిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం వైరల్ అవుతున్న ఫోటో ఎప్పుడో ఓ ఫంక్షన్లో దిగిన ఫోటో అని..అనవసరంగా దాన్ని రాద్దంత చేయవొద్దని అంటున్నారు. అంతే కాదు 2014 ఎన్నికల సమయంలో కూడా కొడాలి నాని వైసీపీలో చేరిన సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్‌పై పుకార్లు షికారు చేసిన విషయం తెలిసిందే.

దానిపై ఎన్టీఆర్ ఫుల్ క్లారిటీ ఇచ్చారు..తన కట్టె కాలే వరకు తన తాత స్థాపించిన టీడీపీలోనే ఉంటానని అన్నారు. టీడీపీ తరపునే ప్రచారం చేస్తానని స్పష్టం చేశాడు. అయితే.. ఎన్నికలు సమీపిస్తున్న ప్రతీసారీ.. జూనియర్ ఎన్టీఆర్ కుటుంబంపై ఇలాంటి తప్పుడు ప్రచారం జరుగుతుండటంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Leave a comment