బీజేపీలోకి టాలీవుడ్ హీరోయిన్‌… ఎమ్మెల్యేగా పోటీ..!

దేశ రాజకీయాల్లో ఈ సారి సినిమా స్టార్ ల సందడి ఎక్కువగా ఉండేలా కనిపిస్తోంది. సందడి అంటే ప్రచార సందడి కాదండి బాబు .. రాజకీయాల్లోకి దిగి తమ తడాఖా చుపించాలనుకుంటున్నారు. తమిళనాడులో కమల్, ప్రకాష్ రాజ్, రజనీకాంత్, ఏపీలో వాణీ విశ్వనాథ్‌, కన్నడాన ఉపేంద్ర లాంటి సినీ ప్రముఖులు రాజకీయ అరంగ్రేటం చేసేందుకు అప్పుడే రంగంలోకి దిగిపోయారు. ఇప్పుడు అదే కోవలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది ఓ కన్నడ బ్యూటీ. !

కొద్ది రోజులుగా కన్నడ సినీ నటి అమూల్య, ఈమె భర్త జగదీశ్‌ సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఎప్పటికప్పుడు వీటిని ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌లలో అప్‌డేట్‌ చేస్తున్నారు. ఇదంతా గమనిస్తుంటే రాజకీయ అరంగేట్రం చేసుకునేందుకు జరుగుతున్న సన్నాహాలేనని గాంధీనగర్‌లోని సినీ పండితులు లెక్కలు వేస్తున్నారు. అమూల్య మామ రామచంద్ర, రాజరాజేశ్వరి నగర్‌ బీజేపీ నేతగా ఉన్నారు. ఈ నేపథ్యంలో కోడలిని ఈ నియోజకవర్గం నుంచి బరిలోకి దింపే అవకాశాలున్నాయని వినిపిస్తోంది. ఇప్పటికే రాజరాజేశ్వరి నగర్‌ నియోజకవర్గం రాష్ట్ర స్థాయిలో వెలుగుతోంది.

ఇందుకు కార‌ణం ఏంటంటే మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు ప్రజ్వల్‌ ఇక్కడి నుంచి జేడీఎస్‌ తరపున బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే మునిరత్న జేడీఎస్‌లోకి ఫిరాయించే అవకాశం కూడా ఉందని అంటున్నారు. ఒకవేళ ఈ రెండు జరిగినా, జరగకపోయినా అమూల్య ఒకవేళ బరిలోకి దిగితే గట్టిపోటీ తథ్యమని బీజేపీ అంచనా వేస్తున్నాయి. తప్పనిసరిగా ఈ నియోజకవర్గాన్ని చేజిక్కించుకోవాలంటే అమూల్యను బరిలో దింపాల్సిందేనని బీజేపీ కూడా ఒక అభిప్రాయానికి వచ్చేసింది. ఈ నేపథ్యంలో ఆమె రాజకీయ ప్రవేశం ఖాయంగానే కనిపిస్తోంది. అమూల్య క‌న్న‌డ పాలిటిక్స్‌లోకి వ‌స్తే మ‌రో సంచ‌ల‌నం న‌మోద‌వ్వ‌డం ఖాయం.

Leave a comment