మా సంగతి ఏంటి ..? టీఅర్ఎస్ సిట్టింగుల్లో ఆందోళన 

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండడంతో తెలంగాణా అధికార పార్టీలో హడావుడి మొదలయిపోయింది. అప్పుడే సీట్ల సర్దుబాటు లెక్కలు కూడా మొదలయిపోవడంతో పాటు అసంతృప్తులు, అలకలు, బుజ్జగింపులు కూడా స్టార్ట్ అయిపోయాయి. ఇంతవరకు ఒక లెక్క అయితే ఇప్పుడు అధికార పార్టీలో కొత్త తలనొప్పులు మొదలయ్యాయి.
ఆపరేషన్ ఆకర్ష్ పేరు తో భారీగా ఇతర పార్టీ నాయకులను చేర్చేసుకున్న టీఆర్ఎస్ ఇప్పుడు చేరిన వారందరికీ టికెట్లు ఎలా సర్దుబాటు చెయ్యాలో తెలియక ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎమ్యెల్యేలకు ఎసరు పెట్టాలని చూస్తోంది దీంతో వారు లబోదిబోమంటూ తమ భవిష్యత్తు మీద బెంగ పెట్టుకున్నారు. ఇప్పుడు అధికార పార్టీ సిట్టింగ్ ఎమ్యెల్యేలకు కంటిమీద కునుకే లేకుండా పోయింది. ప్రజల్లోకి వెళ్లి పనిచేయండి.. ప్రజలకు దగ్గరగా ఉండండి. వచ్చే ఎన్నికల్లో సిట్టింగులందరికీ టికెట్లు ఇస్తా. పనితీరు మెరుగుపరుచుకుంటే ఎలాంటి సమస్యా లేదు. పనిచేసి పేరుతెచ్చుకుంటే చాలు.. అందరికీ టికెట్లు వస్తాయి’… టీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ పార్టీ శాసనసభాపక్ష సమావేశాల్లో గట్టిగానే హెచ్చరికలు చేసాడు .
 పార్టీలో జరుగుతున్న గందరగోళ పరిస్థితులను చూసి సిట్టింగ్ ఎమ్యెల్యేలకు నిద్ర పట్టడంలేదు. వివిధ నియోజకవర్గాల్లో తమ ఎమ్మెల్యేలు ఉండగా ఆయా పార్టీల నుంచి గతంలో మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా పనిచేసిన వారిని ఇప్పటికే పార్టీలో చేర్చుకున్నారు. కొద్ది రోజులుగా మరికొంతమందిని పార్టీలో చేర్చుకుని నియోజకవర్గ ఇన్‌చార్జీల బాధ్యతలు కూడా అప్పజెప్పారు. పదే పదే సిట్టింగులకే అవకాశం ఇస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటిస్తున్నా.. ఒకటీ రెండు నియోజకవర్గాల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో అవకాశం ఉండదని వారికి ఇంకేమైనా బాధ్యతలు అప్పగిస్తామని కేసీఆర్ చెప్పుకొస్తున్నారు.
పార్టీలోకి ఇటీవల చేరుతున్న వారితో పాటు ఇతర ప్రాంతా నుంచి కూడా నాయకులను  తీసుకొచ్చి నియోజకవర్గ ఇంచార్జిలుగా చేస్తుండడం స్థానిక నాయకులకు కంటి మీద కునుకే లేకుండా చేస్తోంది. మహబూబాబాద్‌లో పార్టీ ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌ ఉండగానే, కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే కవితను చేర్చుకున్నారు. ఆమె పార్టీలో చేరి రెండు సంవత్సరాలు అవుతుండగా ఇటీవల పార్టీ, అధికార కార్యక్రమాల్లో ఆమె స్పీడ్  పెంచారని, ఆమెకే ప్రాధాన్యం లభిస్తోందని అంటున్నారు.
 ఆదిలాబాద్‌ జిల్లా ఖానాపూర్‌లో ఎమ్మెల్యే రేఖా నాయక్‌ ఉండగా, టీడీపీ నుంచి మాజీ ఎంపీ రమేశ్‌ రాథోడ్‌ను చేర్చుకున్నారు. వీరి మధ్య సమన్వయం  లేక పార్టీ శ్రేణులు చీలిపోయాయి. తాజాగా భూపాలపల్లిలో స్పీకర్‌ మధుసూదనాచారి ఉండగా, టీడీపీకి చెందిన గండ్ర సత్యనారాయణరావును చేర్చుకున్నారు. ఇదే పరిస్థితి దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ నెలకొంది. దీంతో ఎన్నికల నాటికి ఎవరికి శేయీరు దక్కుతుందో ఎవరికి మొండిచెయ్యి చూపిస్తారో తెలియని పరిస్థితి.

Leave a comment