Movies‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’ మూవీ రివ్యూ, రేటింగ్

‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’ మూవీ రివ్యూ, రేటింగ్

Here is the exclusive review of Satpagiri Express movie review. Comedian Satpagiri turned as hero for the first time with this film. Roshini Prakash played in female lead role opposite to Satpagiri. This film directed by Arun Pawan under Dr. Ravi Kiran Production.

సినిమా : సప్తగిరి ఎక్స్‌ప్రెస్
నటీనటులు : సప్తగిరి, రోషినీ ప్రకాష్, షకలక శంకర్, తదితరులు
దర్శకత్వం : అరుణ్ పవార్
నిర్మాత : డా. రవి కిరణ్
సంగీతం : బుల్గానిన్
సినిమాటోగ్రఫీ : సి.రామ్ ప్రసాద్
ఎడిటర్ : గౌతమ్ రాజు
బ్యానర్ : సాయి సెల్యూలాయిడ్ సినిమాటిక్ క్రియేషన్స్
రిలీజ్ డేట్ : 23-12-2016

కమెడియన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు క్రియేట్ చేసుకున్న సప్తగిరి హీరోగా ఎంట్రీ ఇస్తూ చేసిన చిత్రమే ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’. అరుణ్ పవార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో సప్తగిరి సరసన రోషినీ ప్రకాష్ కథానాయికగా నటించింది. ఫస్ట్‌లుక్ పోస్టర్ నుంచి క్రేజ్ పెంచుకుంటూ వస్తున్న ఈ చిత్రం.. ట్రైలర్, పాటలతో మంచి అంచనాలే పెంచుకుంది. మరి.. వాటిని అందుకోవడంలో ఈ చిత్రం సక్సెస్ అయ్యిందా? లేదా? రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం..

కథ :
నిజాయితీగల కానిస్టేబుల్ అయిన శివప్రసాద్ (శివప్రసాద్).. ఎప్పుడూ అల్లరిచిల్లరిగా తిరిగే తన తనయుడు సప్తగిరి (సప్తగిరి)ని ఐఏఎస్ చేయాలని అనుకుంటాడు. కానీ.. సప్తగిరి తన తండ్రి మాటలు పట్టించుకోకుండా, సినిమాల్లో వెళ్లాలని, పెద్ద నటుడవ్వాలని కలలుగంటుంటాడు. ఈ క్రమంలోనే తన కాలనీకి వచ్చిన పూర్ణిమ (రోహిణి ప్రకాష్) అనే అమ్మాయి వెంట పడుతుంటాడు.

అంతా సాఫీగా సాగుతుందనుకుంటున్న తరుణంలో.. సప్తగిరి కుటుంబానికి ఓ పెద్ద కష్టం వస్తుంది. దాని కారణంగా సప్తగిరి తన సినిమా లక్ష్యాన్ని పక్కనబెట్టేసి.. పోలీస్ ఉద్యోగంలో చేరాల్సి వస్తుంది. అలా పోలీస్ డ్రెస్ వేసుకున్న సప్తగిరి.. తన కుటుంబానికొచ్చిన కష్టానికి కారణం ఎవరో తెలుసుకుని, వాళ్ళను అంతం చేయాలని ప్రయత్నిస్తాడు. అసలు.. సప్తగిరి కుటుంబానికి వచ్చిన ఆ కష్టం ఏంటి? దానికి కారణం ఎవరు? సప్తగిరి వాళ్ళను ఎలా అంతం చేశాడు? అనే అంశాలతో ఈ సినిమా కథ సాగుతుంది.

విశ్లేషణ :
ఈ విషయం అందరికీ తెలుసోలేదో తెలీదు కానీ.. ఈ సినిమా తమిళంలో మంచి విజయం సాధించిన ‘తిరుడన్ పోలీస్’కి రీమేక్. అయితే.. తెలుగు ప్రేక్షకులకు అనుగుణంగా ఇందులో చాలానే మార్పులు, చేర్పులు చేశారు. సప్తగిరిలాంటి కమెడియన్ హీరోగా చేయడంతో.. ఇందులో కామెడీ ఫార్ములాని బాగా వాడుకున్నారు. అదే ఈ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్ అయ్యింది. నిజానికి.. తమిళంలో ఈ చిత్రం కాస్త సీరియస్‌గా సాగుతుంది కానీ, తెలుగులో సప్తగిరి కోసం కామెడీగా మార్చేశారు. కథ రొటీన్‌గానే ఉన్నప్పటికీ.. కాస్త డిఫరెంట్ స్టైల్‌లో తెరకెక్కించారు.

ఫస్టాఫ్ గురించి మాట్లాడుకుంటే.. ఎక్కువగా సప్తగిరి కామెడీతోనే నడిపించారు. సప్తగిరి ‘సినిమా పిచ్చి’తో నడిచిన ప్రారంభ సన్నివేశాలు బాగా నవ్విస్తాయి. అలాగే.. సప్తగిరి, హీరోయిన్ రోషినీ మధ్య నడిచే ప్రేమకథ సరదాగా సాగిపోతుంది. ఓవైపు కామెడీగా నడుస్తూనే.. మరోవైపు తండ్రీ-కొడుకుల మధ్య భావోద్వేగ సన్నివేశాలు వస్తుంటాయి. సింగిల్‌ టేక్‌లో దానవీర శూరకర్ణ డైలాగ్‌ చెప్పడం ఆకట్టుకొంటుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. సప్తగిరి కానిస్టేబుల్ అయ్యాక సప్తగిరి పడే కష్టాలు, తండ్రిని గుర్తు చేసుకొంటూ ఎమోషన్‌కి గురైన సందర్భాలు ఆకట్టుకుంటాయి. సెకండాఫ్ లో కానిస్టేబుళ్ల జీవితాలు ఎంత దుర్భరంగా ఉంటాయో బాగా చూపారు. ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే కామెడీ సీక్వెన్స్ సెకండాఫ్ మొత్తానికి హైలెట్‌గా నిలిచింది. ఇక క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ కూడా థ్రిల్ చేస్తుంది.

ఓవరాల్‌గా చూస్తే.. ఈ సినిమాలో కామెడీకే పెద్ద పీట వేశారు. ఫస్టాఫ్ మొత్తం కామెడీతోనే నడిపించేశారు. ఫస్టాఫ్, సెకండాఫ్‌లలో కానిస్టేబుల్ కాణిపాకం(షకలక శంకర్) పై నడిచే కొన్ని కామెడీ సన్నివేశాలు బాగానే వర్కవుట్ అయ్యాయి. అయితే.. ఇంటర్వెల్ వరకు అసలు కథలోకి వెళ్ళకపోవడం మైనస్ పాయింట్. కొన్ని కామెడీ సీన్స్, అనవసరమైన సన్నివేశాలు చికాకు పెట్టాయి. హీరోని మరీ కామెడీగానే చూపించడంతో.. సీరియస్‌నెస్ ఉండాల్సిన చోట ఆ ఫీల్ ఉండదు. కీలకమైన కొన్ని నెగెటివ్ పాత్రల్ని చాలా బలహీనంగా చూపడంతో సీరియస్‌నెస్ చాలావరకూ మిస్సయింది. మధ్యలో వచ్చే పాటలు మరింత చిరాకు తెప్పించాయి.

నటీనటుల పనితీరు :
మొదటిసారి హీరోగా చేసిన సప్తగిరి.. తన కామెడీ టైమింగ్‌తోపాటు ఎమోషనల్, సీరియస్ సన్నివేశాల్లో బాగా నటించాడు. సినిమా ఓపెనింగ్లో పురాణాల్లోని శ్రీరామ కళ్యాణ ఘట్టంలో వచ్చే పరశురాముడి వేషధారణలో హావభావాలను ఆకర్షణీయంగా పలికించడంతోపాటు డైలాగులను నిరాటంకంగా చెప్పి మెప్పించాడు. తండ్రిపాత్రలో శివ ప్రసాద్ మంచి నటనే కనబరిచాడు. కానిస్టేబుల్ కాణిపాకం క్యారెక్టర్‌లో నటించిన షకలక శంకర్ బాగానే నవ్వులు పండించాడు. రోషినీ ప్రకాష్ గ్లామర్‌తో ఆకట్టుకుంది. ఈమె పాత్రకి అంతగా ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇతర నటీనటులు తమతమ పాత్రల పరిధి బాగానే నటించారు.

సాంకేతిక పనితీరు :
రామ్ ప్రసాద్ అందించిన సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. కొన్ని చోట్ల అతని కెమెరా పనితనాన్ని మెచ్చుకోవాల్సిందే. గౌతమ్ రాజు ఎడిటింగ్ సరిగా లేకపోవడంతో.. కాస్త కన్ఫ్యూజన్ కలిగింది. బుల్గేనిన్ సంగీతం ఏమంత ఆకట్టుకోలేదు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఫర్వాలేదు. నిర్మాత డా. రవి కిరణ్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఇక దర్శకుడు అరుణ్ గురించి మాట్లాడితే.. తమిళ సినిమా నుంచి తీసుకున్న ఈ కథను మన నేటివిటీకి తగ్గట్టు మార్చుకున్న దర్శకుడు కామెడీనే హైలైట్ చేశాడు తప్ప.. సీరియస్‌నెస్ మెయిన్‌టైన్ చేయలేదు. కథ, కథనాల్లో ఎక్కడా సీరియస్‌నెస్ లేదు. ద్వితీయార్ధంలో రివేంజ్‌ డ్రామా విషయంలో దర్శకుడు ఇంకాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సింది.

ఫైనల్ వర్డ్ : ఈ సప్తగిరి బాగా నవ్వించాడు కానీ.. పూర్తిగా ఆకట్టుకోలేకపోయాడు.
‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’ రేటింగ్ : 2.75/5

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news