Moviesశ్రీనివాస్ రెడ్డి, పూర్ణల ‘జయమ్ము నిశ్చయమ్మురా’ మూవీ రివ్యూ రేటింగ్

శ్రీనివాస్ రెడ్డి, పూర్ణల ‘జయమ్ము నిశ్చయమ్మురా’ మూవీ రివ్యూ రేటింగ్

Here is the exclusive review of star comedian Srinivasa Reddy and Poorna’s latest movie Jayammu Nischayammu Raa which is directed by debut director Shiva Raj Kanumuri. This movie has gained more publicity during first look release. Let’s see this movie reached upto the mark or not.

చిత్రం : ‘జయమ్ము నిశ్చయమ్మురా’
నటీనటులు : శ్రీనివాసరెడ్డి, పూర్ణ, కృష్ణ భగవాన్, పోసాని కృష్ణమురళి, తదితరులు
రచన-దర్శకత్వం : శివరాజ్ కనుమూరి
నిర్మాతలు : శివరాజ్ కనుమూరి, సతీష్ కనుమూరి
బ్యానర్ : శివరాజ్ ఫిల్మ్స్
సంగీతం : రవిచంద్ర
సినిమాటోగ్రఫీ : నగేష్ బానెల్
ఎడిటర్ : వెంకట్
రిలీజ్ డేట్ : 25-11-2016

స్టార్ కమెడియన్ శ్రీనివాసరెడ్డి, పూర్ణ జంటగా నటించిన లేటెస్ట్ ‘జయమ్ము నిశ్చయమ్మురా’. కొత్త దర్శకుడు శివరాజ్ కనుమూరి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం.. ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఫస్ట్‌లుక్ నుంచి భారీ క్రేజ్ మూటగట్టుకున్న ఈ చిత్రం.. ఆ తర్వాత టీజర్, ట్రైలర్, ప్రమోషన్ కార్యక్రమాలతో మరిన్ని అంచనాలు పెంచుకుంది. మరి.. వాటిని అందుకుందా? లేదా? అనేది రివ్యూలోకి వెళ్లి తెలుసుకుందాం..

కథ :
సర్వేష్ అలియాస్ సర్వమంగళం (శ్రీనివాసరెడ్డి) కరీంనగర్లోని ఓ పేద కుటుంబానికి చెందిన కుర్రాడు. ఆత్మవిశ్వాసం చాలా తక్కువగా ఉండే ఇతనికి.. మూఢనమ్మకాలు, స్వామీజీల మీద నమ్మకం ఎక్కువ. తన గురువు చెప్పినట్లుగా నడుచుకుంటుంటాడు. ఇదిలావుంచితే.. పీజీ పూర్తి చేసిన సర్వమంగళం ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటాడు. ఇందులో భాగంగానే గ్రూప్-2 పరీక్షలు రాయగా.. అతనికి జాబ్ వస్తుంది. అతని తొలి పోస్టింగ్ కాకినాడలో వస్తుంది. అయితే.. ఇంటిదగ్గర తల్లి ఒంటరిగా ఉండడంతో, సాధ్యమైనంత త్వరగా ఉద్యోగాన్ని కరీంనగర్‌కి బదిలీ చేయించుకుని రావాలనుకుంటాడు.

కట్ చేస్తే.. ఉద్యోగరీత్యా సర్వమంగళం కాకినాడకి చేరుకుంటాడు. తన ఆఫీస్ పక్కనే ‘మీసేవ’లో పనిచేసే రాణి (పూర్ణ)ని చూసి ప్రేమిస్తాడు. ఆమెని పెళ్ళి చేసుకుంటే త్వరగా ట్రాన్ఫర్ అవుతుందని అతని గురువు చెప్పగా.. ఎలాగైనా రాణిని పెళ్ళి చేసుకుని, ఉద్యోగం బదిలీ చేయించుకోవాలని అనుకుంటాడు. మరి అతడి ప్రయత్నాలు ఫలించాయా? రాణి అతణ్ని ప్రేమిస్తుందా? చివరికి తన లక్ష్యమైన ట్రాన్ఫర్ ను పొందాడా? లేదా? అన్న అంశాలతోనే ఈ సినిమా కథ సాగుతుంది.

విశ్లేషణ :
దర్శకుడు ఎంచుకున్న స్టోరీలైన్, దాని చుట్టూ కథని అల్లుకున్న తీరుని మెచ్చుకోవచ్చు. రోజువారీ జీవితంలో మనకు కనబడే ఒక పిరికి పాత్రను హైలైట్ చేస్తూ.. ఆడియెన్స్ కోరుకునే ఎలిమెంట్స్‌తో వినోదాత్మకంగా తెరకెక్కించాడు. అలాగే.. కరీంనగర్, కాకినాడ లొకేషన్స్‌‌ని తెలివిగా వాడుతూ ఆహ్లాదకరంగా రూపొందించాడు.

ఈ సినిమాని ప్రారంభించిన విధానం చాలా బాగుంది. పాత్రలన్నింటినీ పరిచయం చేస్తూ.. అందులోనే కామెడీని బాగా ఎలివేట్ చేశారు. ఆ పాత్రల చుట్టే సినిమాని బాగానే నడిపించారు. అలాగే.. హీరో, హీరోయిన్ల మధ్య రొమాంటిక్ ట్రాక్ కూడా ఆకట్టుకుంటుంది. అయితే.. నరేషన్ చాలా స్లోగా ఉండడంతో అక్కడక్కడ బోర్ కొడుతుంది. ఇంటర్వెల్‌లో వచ్చే ట్విస్ట్ మామూలే. ఇక సెకండాఫ్ మొత్తం.. హీరో సమస్యల్ని ఎలా పరిష్కరించాడన్న దాని చుట్టే నడుస్తుంది. ఒక్కొక్క సమస్యని హీరో పరిష్కరించుకుంటూ వెళ్లే తీరు ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలోనే వచ్చే కామెడీ ట్రాక్ టైంపాస్ చేయిస్తుంది. క్లైమాక్స్‌ని ముగించిన తీరు బాగుంది కానీ.. అది స్లోగా ఉండడమే మైనస్. ఓవరాల్‌గా.. కాస్త నెమ్మదిగా సాగినా ఈ చిత్రం ఆడియెన్స్‌కి మంచి అనుభూతినిస్తుంది.

‘దేశవాళీ వినోదం’ అనే పేరుకి తగ్గట్టుగా నెటివిటీ ఫ్యాక్టర్‌తో చిత్రాన్ని తీర్చిదిద్దారు. అయితే.. నరేషన్ స్లోగా ఉండడం ఈ మూవీకి మేజర్ మైనస్ పాయింట్. చాలాసేపటివరకు అసలు కథలోకి వెళ్లకుండా పాత్రలను పరిచయం చేయడంలో ఎక్కువ సమయాన్ని కేటాయించడంతో బోర్ కొడుతుంది. అలాగే.. హీరో చుట్టూ వచ్చే కొన్ని అనవసరమైన సీన్లు విసిగిస్తాయి. సెకండాఫ్‌లో హీరో పాత్ర మారిపోయాక స్టోరీ కాస్త పక్కదారి పట్టింది. ఈ మైనస్ పాయింట్స్‌ని పట్టించుకోకపోతే.. ఈ చిత్రంలోని వినోదాన్ని ఆస్వాదించవచ్చు.

నటీనటుల పనితీరు :
శ్రీనివాసరెడ్డి అద్భుత నటన కనబరిచాడు. ‘హీరో’ వేషాలేమీ వేయకుండా.. చాలా పద్ధతిగా, పాత్రకు తగ్గట్టు సహజ నటనతో మెప్పించాడు. ఒక్క మాటలో చెప్పాలంటే.. పూర్తి సినిమాను తన భుజాల మీద నడిపించాడు. ఇక హీరోయిన్ పూర్ణ కూడా బాగానే నటించింది. క్యూట్ లుక్స్, స్మైల్‌తో ఆకట్టుకుంది. వీరిద్దరి జోడి బాగానే కుదిరింది. స్ర్కీన్ మీద చూస్తున్నప్పుడు చూడముచ్చటగా కనిపిస్తారు. రవివర్మ నెగెటివ్ క్యారెక్టర్లో ఆకట్టుకుంటే.. శ్రీవిష్ణు పాత్ర భలే ఫన్నీగా సాగుతుంది. ప్రవీణ్-పోసాని కాంబినేషన్లో సీన్లు బాగా పండాయి. కృష్ణభగవాన్ చాలాకాలం తర్వాత ఓ మంచి రోల్ పోషించాడు. తన కామెడీ టైమింగ్‌తో, అడల్ట్ పంచ్‌లతో అదరగొట్టాడు. ప్రభాస్ శీను కూడా నవ్వించాడు. ఇతర నటీనటులు తమతమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక పనితీరు :

ఈ మూవీని నగేష్ బానెల్ అందించిన సినిమాటోగ్రఫీ చాలా ప్లెజెంట్‌గా అనిపిస్తుంది. రవిచంద్ర అందించిన పాటలు సినిమాలో చక్కగా ఇమిడిపోయాయి. నేపథ్య సంగీతం కూడా బాగా కుదిరింది. నిర్మాణ విలువలు ఓకే. ఇక రైటర్ కమ్ డైరెక్టర్ శివరాజ్ కనుమూరి తొలి సినిమాతోనే తనదైన ముద్ర వేశాడు. మంచి కథ రాసుకోవడంతోపాటు బలమైన పాత్రల్ని తీర్చిదిద్దాడు. నటీనటలు, సాంకేతిక నిపుణుల నుంచి మంచి ఔట్ పుట్ రాబట్టుకోగలిగాడు. అయితే.. అతని నరేషన్ మరీ స్లో. ఓవరాల్‌గా.. దర్శకుడిగా మంచి మార్కులే కొట్టేశాడు.

చివరగా : ఓ మంచి అనుభూతి అందించే దేశవాళీ వినోదం
‘జయమ్ము నిశ్చయమ్మురా’ మూవీ రేటింగ్ : 3/5

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news