పవన్ కళ్యాణ్ ..అవునంటే కాదనిలే..కాదంటే అవుననిలే!!

pawan kalyan speech

Pawan Kalyan did not take any stand about BJP, TDP and Demonetization. Sometimes he support and sometimes opposes. People believes that pawan Kalyan doesn’t have any clarity.

తెలుగు సినిమాల ద్వారా గుర్తింపు తెచ్చుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎన్నో కీలక, నాటకీయ పరిణామాల తర్వాత జనసేన పార్టీని స్థాపించారు. తన అన్న, చిరంజీవి స్థాపించిన పార్టీ ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ లో విలీనం చేసిన తర్వాత ఎంతో ఆలోచించి పవన్ జనసేనను స్థాపించారు. పవన్ మాట తీరు ఆయనకు రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చింది. కేసీఆర్ ఎలాగయితే తెలంగాణ యాసతో ప్రజలకు ఈజీగా కనెక్ట్ అయ్యారో అలాగే పవన్ ఆవేశంతో కూడిన ప్రసంగాలు ప్రజలకు కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఓ విషయాన్ని గమనించాలి.. పవన్ మాట తీరు ఎలా ఉన్నా ఏం మాట్లాడుతున్నారు అనేది చాలా ముఖ్యం.

పవన్ కళ్యాణ్ పార్టీ స్థాపించే టైంలో ఎన్నో కవితలు వినిపించారు. పేదవాడికి ఇప్పటికి ఆకలి తీరడం లేదు.. పిల్లలకు ఇప్పటికి విద్య అందడం లేదు అంటూ దేశంలో పాతుకుపోయిన అన్ని సమస్యలను ఎత్తిచూపారు. వాటన్నింటిని నిర్మూలించేందుకు పొలిటికల్ గా అడుగులు వేస్తున్నట్లు చూపించారు. అన్నింటికి మించి జనం తరఫున ప్రశ్నిస్తాం అంటూ జెండా ఎత్తారు. పదవుల కోసం కాదు ప్రశ్నించడానికి అంటూ నినదించారు. కానీ ఇప్పటి వరకు ఎన్ని సార్లు ప్రశ్నించారు.? ఏం ప్రశ్నించారు?

గత సార్వత్రిక ఎన్నికల్లో మోదీ, చంద్రబాబులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చలేదని చంద్రబాబు నాయుడు గానీ, మోదీని కానీ ఇప్పటికి పవన్ ప్రశ్నించలేదు. ఇక అమరావతి భూముల విషయంలో తప్పదు అన్నట్లు కనిపించి.. మీటింగ్ పెట్టి వెళ్లిపోయారు. మెగా ఆక్వాఫుడ్ ప్రాజెక్ట్ విషయంలోనూ అంతే. అసలు పవన్ ఏం చెయ్యాలనుకుంటున్నారు అన్నది ప్రశ్నార్థకంగా ఉంది.

అమరావతి విషయంలో చంద్రబాబు నాయుడులాంటి నాయకుడు మాత్రమే న్యాయం చేస్తాడు అని అంటాడు పవన్. కానీ అమరావతి పేరుతో భూములు లాక్కుంటే మాత్రం ఊరుకునేదిలేదు అని మీడియా ముందు గట్టిగా చెబుతారు. తీరా చంద్రబాబుకు ఆ రకంగా ఏమైనా వత్తిడి చేస్తారా? అంటే అది ఉండదు. ప్రత్యేక హోదా కోసం తాను పోరాడతాను అంటాడు.. కానీ తర్వాత ఎంపీల వల్ల కాకపోతే అప్పుడు తాను రంగంలోకి దిగుతాను అంటాడు. ప్రత్యేక హోదాపై కేంద్రం మోసం చేసింది అంటాడు కానీ కేంద్రంలో మిత్రపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీని మాత్రం ఏమీఅనరు. ఇలా పవన్ ఉండి కూడాలేనట్లు ఉంటున్నారు.

తాజాగా పెద్దనోట్ల విషయంలోనూ అదే తప్పు. పెద్దనోట్ల కారణంగా సామాన్యులు చాలా కష్టపడుతున్నారు.. అసలు ఆ అధికారం ఎవరు ఇచ్చారు అన్నట్లు ఓ పోస్ట్ ను ట్వీట్ చేశాడు. దీంతో మోదీతో, పవన్ కు చెడింది అని సంకేతాలు వచ్చేలా చేశారు. కానీ తర్వాత మాత్రం కర్నూలులో ఓ వ్యక్తి చనిపోతే వెంటనే బిజెపి ఎంపీలు ప్రజలకు భరోసానిచ్చేలా క్యు లైన్లలో నిల్చోవాలి అని సలహా ఇస్తారు. అంటే ఓ రకంగా మోదీ, కేంద్రం తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని అన్నట్లు. ఇలా పవన్ రెండు భావాలను ఒకే అంశం మీద వ్యక్తం చెయ్యడం ఎవరికీ అర్థంకావడం లేదు. తన సినిమాలోనే ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అన్నట్లు రాజకీయాల్లో పవన్ మాటలకు అర్థాలేవేరేలా అనిపిస్తున్నాయి.

Leave a comment