ఒకే రోజు 12 సినిమాలు… ఏ సినిమా చూడాలి..

190

టాలీవుడ్‌లో గ‌త మూడు నెల‌లుగా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర వారానికి మూడు, నాలుగు సినిమాలు రిలీజ్ అవుతూ వ‌స్తున్నాయి. వీటిలో ఏ ఒక్క‌టి కూడా హిట్ టాక్ తెచ్చుకోలేదు. మ‌హేష్‌బాబు మ‌హ‌ర్షి సినిమా ఒక్క‌టే యావ‌రేజ్ టాక్‌తో కూడా మంచి వ‌సూళ్లు రాబ‌ట్టుకుంది. మ‌హ‌ర్షి సినిమాకు ముందు, వెన‌కా చాలా సినిమాలు వ‌చ్చినా అవి థియేట‌ర్ల‌లో నిల‌బ‌డ‌లేదు. ఇక ఈ వారం బాక్సాఫీస్ ద‌గ్గర ఒక‌టి కాదు, రెండు కాదు ఏకంగా 12 సినిమాలు సంద‌డికి రెడీ అవుతున్నాయి.

ఈ యేడాది ఇప్ప‌టికే పెద్ద సినిమాలు అన్నీ రిలీజ్ అయ్యాయి. ఈ యేడాదిలో సాహో, సైరా మాత్ర‌మే పెద్ద సినిమాలు ఉన్నాయి. దీంతో థియేట‌ర్లు దొర‌క‌డం లేద‌ని గ‌గ్గోలు పెట్టే చిన్న సినిమాల‌కు పండ‌గ వాతావ‌ర‌ణం నెల‌కొంది. ఈ వారం కూడా టాలీవుడ్‌లో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాష‌ల్లో క‌లిపి మొత్తం 12 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇవ‌న్నీ లో బ‌డ్జెట్‌, స్టార్ కాస్టింగ్ లేని సినిమాలే.

వీటిల్లో థ్రిల్ల‌ర్ జాన‌ర్లో తెర‌కెక్కుతోన్న విశ్వామిత్ర‌. గీతాంజ‌లి ఫేం రాజ్‌కిర‌ణ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఇప్పటికే పలు వాయిదాలు పడి ఈ వారం ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సప్తగిరి హీరోగా రూపొందిన వజ్రకవచధరి గోవిందా మీద కాస్త మాస్ ఆడియన్స్ తప్ప ఇంకెవరు ఆసక్తి కనపరచడం లేదు. ఈ సినిమా గురించి ప‌ట్టించుకున్న నాథుడే లేడు. ఇక క‌న్న‌డ స్టార్ హీరో ఉపేంద్ర కన్నడ డబ్బింగ్ ఐ లవ్ యు కూడా ఈ వారమే వస్తున్నా దీనిపై కూడా ఎవ్వ‌రికి ఆసక్తి లేదు.

జనవరిలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన బాలీవుడ్ యుఆర్ ఐని తెలుగులోకి డబ్ చేస్తున్నారు. తాప్సీ నటించిన గేమ్ ఓవర్, స్పెషల్ అనే మరో సినిమా కూడా రేసులో ఉన్నాయి. ఇవి కాకుండా ఎక్-ఖమోషి-కిస్సే బాజ్-వన్ డే హింది సినిమాలు వస్తున్నాయి. హాలీవుడ్ నుంచి మెన్ ఇన్ బ్లాక్ ఇంటర్నేషనల్- సీక్రెట్ లైఫ్ అఫ్ పెట్స్ 2 వస్తున్నాయి. ఇలా చెప్పుకోవడానికి చాలానే వస్తున్నా వీటిని చూసేందుకు జ‌నాలు మాత్రం ఆస‌క్తితో లేరు.

Leave a comment