Specialsవీ6, టీవీ9 రేటింగ్ బ్యాన్ వెనుక కుట్ర ఉందా..?

వీ6, టీవీ9 రేటింగ్ బ్యాన్ వెనుక కుట్ర ఉందా..?

టీవీ రేటింగ్స్ ఇచ్చే సంస్థలో దొంగలు పడ్డారా. దొంగల్ని పట్టడం మానేసి దొంగ ముద్రలు వేసే పని మొదలుపెట్టారా. ఇపుడు చాలామంది డౌట్ ఇదే. గతంలో లంచాలు మేసి కావాల్సినవాళ్లకు కావాల్సినన్ని టీఆర్పీలిచ్చిన మాజీ రేటింగ్ సంస్థకు పోటీగా ఓ రేటింగ్ సంస్థ మొదలైంది. ఆ దెబ్బకు మాజీ రేటింగ్ సంస్థ దుకాణం బందైంది. బ్రాడ్ కాస్టర్లు, అడ్వర్టైజర్లు, అడర్వ్టైజింగ్ ఏజెన్సీలు కలిసి ఏర్పాటు చేసుకున్న కొత్త సంస్థ సరికొత్త టెక్నాలజీతో మంచి రేటింగ్స్ అందిస్తుందని అందరూ భావించారు. కానీ ఏడాదిలోనే మాజీ రేటింగ్ సంస్థను మించిపోయింది. నిర్వాహకులు స్ట్రిక్ట్ గా ఉన్నామని చెబుతున్నా కిందిస్థాయిలో పనిచేసే దొంగలు మాత్రం పాత కాపులే కావడంతో నయా రేటింగ్ సంస్థ కూడా చేతులెత్తేసింది. ఇందులో ప్రతినిధులుగా ఉన్నవాళ్లు కొన్ని చానెళ్ల దగ్గర డబ్బులు మేసి మీటర్లను మేనేజ్ చేయడం అలవాటుగా మారిపోయిందని టెలివిజన్ ఇండస్ట్రీలో తెలిసిందే. ఒక దశలో మేమేం చేయాలో కూడా అర్థం కావడం లేదని రేటింగ్ సంస్థ అధినేతలే అంటున్నారని టాక్.

ఇప్పుడు అసలు కథకు వద్దాం. రేటింగ్స్ అనుమానాస్పదంగా ఉన్నాయన్న కారణంతో టీవీ9, వీ6 న్యూస్ చానెల్స్ రేటింగ్స్ ను 4 వారాలు నిలిపేస్తున్నట్టు తాజా రిపోర్ట్ ప్రకటించింది. దీంతో ఏదో దొంగల్ని పట్టేసినట్టుగా కొంతమంది సంబరపడ్డారు. రేటింగ్స్ విధానం ప్రక్షాళన జరిగిపోయినట్టుగా ఇంకొంతమంది ఫీలయ్యారు. మేం దొరకలేదని ఇంకొంతమంది భుజాలు తడుముకున్నారు. కానీ అసలు కథ వేరే ఉంది. ముందుగా రేటింగ్ నిలిపేసిన రెండు చానెళ్ల సంగతి చూద్దాం. తెలుగు న్యూస్ మీడియాలో మొదటగా వచ్చిన టీవీ9 సంచలనాలతో జనంలోకి వెళ్లింది. ఎన్ని విమర్శలు ఉన్నా లాయల్ ప్రేక్షకుల్ని సంపాదించుకుంది. ఆ తర్వాత 2012లో వచ్చిన వీ6 న్యూస్ తెలంగాణ చానెల్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తీన్మార్ లాంటి కార్యక్రమాలతో ఎంటర్ టైన్మెంట్ చానెల్స్ కు పోటీగా రేటింగ్స్ సాధించింది. కొత్త రేటింగ్ సంస్థ వచ్చినప్పటి నుంచీ కూడా ఈ రెండు చానెల్స్ రేటింగ్స్ లో ముందే ఉన్నాయి. కానీ విచిత్రంగా రేటింగ్ మొదలైనప్పుడు బాగా వెనుకబడి ఉన్న రెండుమూడు చానెల్స్ ఏడాది తర్వాత ముందుకొచ్చేశాయి. రేటింగ్ మేనేజ్ మెంట్లో ఆరితేరిన సదరు రెండుమూడు చానెళ్ల బండారం కొత్త రేటింగ్ సంస్థ రాగానే బయటపడింది. దీంతో ఆ చానెళ్లు ఇప్పుడున్న సంస్థలో బొక్కలు వెతికిపట్టుకున్నారు. పాత ముఠా మళ్లీ కొత్త రేటింగ్ కంపెనీలో పాగా వేశారు. దీంతో మళ్లీ పాత కథ కొనసాగింది.

ట్యామ్ లో చేయితిరిగిన ఓ చానెల్ పెద్దాయన పనితనంతో.. రేటింగ్ సంస్థలో పనిచేసే ఓ పెద్దమనిషి చక్రం తిప్పడం మొదలుపెట్టారు. కరెంటు మీటర్లు తిప్పినట్టు రేటింగ్ మీటర్లు తిప్పడం మొదలుపెట్టారు. దీంతో ఇంట్లోనే దొంగల్ని పెట్టుకున్నారేంటని సదరు రేటింగ్ సంస్థకు ఫిర్యాదులు వెళ్లాయి. రేటింగ్ మేనేజ్ మెంట్ లో రెడ్ హ్యాండెడ్ గా దొరికిన ఓ తెలుగు సినిమా చానెల్ ప్రతినిధులు ఏకంగా చానల్ పెద్దమనిషి పేరుకూడా బయటపెట్టారు. మరి ఆయన మీద చర్యలు తీసుకున్నారా? లేదు.

అయితే చానల్ పెద్దాయన కంటే.. రేటింగ్ సంస్థలో పనిచేసే పెద్దమనిషే ఎక్కువ ఫీలయ్యాడంట. రేటింగ్ కోసం అక్రమాలకు పాల్పడుతున్నవారిని పట్టడం మానేసి ఫిర్యాదులు చేసినవారిపైనే కత్తిగట్టారు. దీంతోనే టీవీ9, వీ6 రేటింగ్స్ ను నిలిపేసినట్టు ఇన్ సైడ్ టాక్. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువమంది చూసే రెండు చానెల్స్ రేటింగ్ ను నిలిపేయడం వివాదాస్పదంగా మారుతోంది. అసలు ఎవరూ చూడకుండానే రేటింగ్ లో ముందుకొచ్చిన చానెల్స్ పై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దాని విశ్వసనీయతను ప్రశ్నార్థకంగా మారుస్తోంది.

ఇక్కడ కొన్ని’ భేతాళ ప్రశ్నలు కొన్ని మిగిలిపోయాయ. నిజంగా రేటింగ్ మేనేజ్ చేసి రాత్రికి రాత్రి పైకొచ్చిన చానెళ్ల సంగతేంటి? కరీంనగర్ కేంద్రంగా నాలుగు చానెళ్లకు మీటర్లు తిప్పి పెట్టే బ్రోకర్లను ఆ సంస్థ ఏం చేస్తుంది? రేటింగ్ మీటర్ల డేటాను అమ్ముకునే పెద్దాయన బండారం చివరికి బయటపడిందా? అసలు దొంగల్ని వదిలేసి రేటింగ్ సంస్థ నిజంగా పాపులర్ చానెళ్లపై ఎందుకు పడింది? ఇవీ ఇప్పుడు మిగిలిపోయిన ప్రశ్నలు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news