Newsసోషల్ మీడియా కేంద్రంగా వ్యభిచారం

సోషల్ మీడియా కేంద్రంగా వ్యభిచారం

ఆర్థిక పరిస్థితులు బాగాలేక కొందరు.. జల్సాల మరికొందరు నరకకూపంలోకి దిగుతుండగా, నగర కేంద్రంగా హైటెక్ వ్యభిచారం జోరుగా సాగుతున్నది. ఉమ్మడి జిల్లాతోపాటు ఆంధ్రారాష్ట్రం నుంచి వస్తున్న యువతులకు బ్రోకర్లు ఫిఫ్టీ ఫిఫ్టీ ఎరవేసి ఈ ఉచ్చులోకి దింపుతూ, శివారు ప్రాంతాలే అడ్డాగా చీకటి దందా సాగిస్తున్నట్లు తెలుస్తున్నది. సెల్‌ఫోన్లతోపాటు సోషల్‌మీడియా ద్వారా రెగ్యులర్‌గా వచ్చే విటులతోపాటు అమాయకులకు ఎరవేస్తున్నారు. నమ్మకస్తులతో వాట్సాప్, ఫేస్‌బుక్ ఇతర సోషల్ మీడియాలో గ్రూపులు ఏర్పాటు చేస్తున్నారు. అమ్మాయిల ఫొటోలు పెట్టి ఆకర్షిస్తున్నారు. అమ్మాయి ఫొటో సెలక్షన్ చేసుకుంటే, అందులోనే రేటు మాట్లాడి బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. తర్వాత వారు చెప్పిన ప్రాంతానికి విటులను రప్పించడం, లేదంటే విటులు కోరుకున్న చోటకే యువతులను పంపిస్తున్నారు. ముఖ్యంగా 18 ఏళ్ల నుంచి 30ఏళ్ల వయసు వారితో వ్యాపారం చేయిస్తూ, ఒక్కో విటుడి నుంచి వెయ్యి నుంచి 20వేల వరకు తీసుకుంటున్నట్లు తెలుస్తున్నది.

ఇందులో చాలా వరకు విద్యార్థులతోపాటు పెద్ద పెద్ద వ్యాపారుల దాకా ఉంటున్నట్లు సమాచారం. సెల్‌ఫోన్లతోపాటు సోషల్ మీడియా గ్రూపుల్లో ఫొటోలు పెట్టి, విటులకు వల వేసి వ్యాపారం చేస్తున్నట్లు వెలుగులోకి వస్తున్నది. జిల్లాకేంద్రంతోపాటు శివారు ప్రాంతాల్లో సుమారు 30వరకు కేంద్రాల్లో దందా కొనసాగిస్తున్నట్లు తెలుస్తున్నది. కుటుంబ పరిస్థితుల రీత్యా కొంతమంది యువతులు ఈ ఉచ్చులో చిక్కుకుంటే, మరికొంత మంది జల్సాల కోసం దిగుతున్నట్లు స్పష్టమవుతున్నది.
కొంతమంది నిర్వాహకులు పక్కా వ్యూహంతో యువతులకు ఎరవేస్తున్నారు. ఉమ్మడిజిల్లాతోపాటు వరంగల్, హైదారాబాద్, విజయవాడ, రాజమండ్రి, గుంటూరు, కాకినాడ ప్రాంతాల నుంచి మహిళలతోపాటు చదువుకునే అమ్మాయిలను రప్పిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు తెలియకుండానే బ్రోకర్ల చేతిలో చిక్కుతున్నారు. ఆశ్రయం ఇసున్నట్లు నమ్మించి, వచ్చిన ఆదాయంలో ఫిఫ్టీ ఫిఫ్టీ అంటూ వ్యాపారం చేయిస్తున్నారు.

ముఖ్యంగా నగర శివారు కాలనీలతోపాటు జన సంచారం తక్కువగా ఉండే ఏరియాల్లో విలాసవంతమైన ఇండ్లను అద్దెకు తీసుకుని ఎవరికీ అనుమానం రాకుండా దందా చేయిస్తున్నారు. రెండు మూడు నెలలకోసారి ఆ ఇండ్లను కూడా మారుస్తున్నారు. అసాంఘిక కార్యకలాపాల నియంత్రణే లక్ష్యంగా రంగంలోకి దిగిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు, జూలై ఒకటి నుంచి ఎన్నో దందాలను బట్టబయలు చేస్తున్నారు. గత నెల 9న రాత్రి నగరంలో పోశమ్మవాడ ప్రాంతంలో ఓ వ్యభిచార గృహంపై దాడి చేసి, నిర్వాహకురాలిని అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు విటులను అరెస్టు చేసి, కాకినాడకు చెందిన యువతికి విముక్తి కల్పించారు. తిరిగి 20న రాంచంద్రాపూర్ కాలనీలోని ఓ గృహంపై దాడి చేసి తిమ్మాపూర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన నిర్వాహకురాలిని అరెస్టు చేశారు. రాజమండ్రి, కోదాడకు చెందిన ముగ్గురు యువతలకు విముక్తి కల్పించారు.

23న కృష్ణానగర్‌లో నిర్వహిస్తున్న వ్యభిచార గృహంపై దాడి చేశారు. నిర్వాహకురాలు, ఐదుగురు విటులను పట్టుకుని వారి వద్ద నుంచి 34 వేలతోపాటు ఒక కారు, రెండు బైకులు, ఏడు మొబైళ్లను స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ, రాజమండ్రి, కాకినాడ, హైదరాబాద్‌కు చెందిన యువతులను, చదువుకునే అమ్మాయిలతో వ్యభిచారం చేయిస్తున్నట్లు గుర్తించారు. ఓ మహిళతోపాటు కాకినాడకు చెందిన ఓ యువతిని ఆ కూపం నుంచి కాపాడారు. టాస్క్‌ఫోర్స్ పోలీసులు వ్యభిచార దందాలను మరోసారి బట్టబయలు చేశారు. సుభాష్‌నగర్ ప్రాంతంలోని ఓ గృహంపై దాడి చేసి, నిర్వాహకురాలు గంట భారతిని అదుపులోకి తీసుకున్నారు. చుట్టు పక్కల గ్రామాల నుంచి మహిళలను తీసుకొచ్చి ఈ దందా చేయిస్తున్నట్లు గుర్తించారు. ఉమ్మడి జిల్లాకు చెందిన ఓ యువతికి విముక్తి కల్పించి, హైదరాబాద్‌కు చెందిన సందీప్‌రెడ్డి అనే విటుడిని పట్టుకున్నారు.

ఇదే సమయంలో నగర శివారులోని కృష్ణానగర్‌లో వ్యభిచార గృహంపై దాడి చేసి, నిర్వాహకురాలు విజయలక్ష్మిని పట్టుకున్నారు. చుట్టుపక్క ప్రాంతాలతోపాటు హైదరాబాద్, ఆంధ్రా నుంచి యువతులు, మహిళలను తీసుకువచ్చి వ్యాపారం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఇద్దరు మహిళలను విముక్తి కల్పించారు. నాగయ్య అనే విటున్ని పట్టుకున్నారు. ఈ రెండు కాలనీలు నగర శివారుల్లోనే ఉండగా, గతంలో ఈ ప్రాంతంలో ఎన్నోసార్లు దందాలు బహిర్గతం అయిన ఘటనలున్నాయి. ఇలానే శివారు ప్రాంతాల్లో సుమారు 30 వరకు కేంద్రాలున్నట్లు సమాచారం. నిజానికి ఇలాంటి హైటెక్ వ్యభిచారం ఇంతకాలం ముంబై, హైదరాబాద్ లాంటి మహానగరాలకే పరిమితం కాగా, నేడు జిల్లా కేంద్రంలో విస్తరించడం కలవరపెడుతున్నది. వీరంతా పోలీసు దాడుల్లో అడపాదడపా పట్టుబడడం, తర్వాత మళ్లీ అదే దారిలో పయనించడం రివాజుగా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news