News‘మెడలు వంచి కూర్చోపెడతాం’.. ఆంధ్రుల్లో సెగలు రేపుతున్న పవన్ తాజా వ్యాఖ్యలు

‘మెడలు వంచి కూర్చోపెడతాం’.. ఆంధ్రుల్లో సెగలు రేపుతున్న పవన్ తాజా వ్యాఖ్యలు

Pawan Kalyan creates sensation with his latest tweets as supporting to youth who are going to protest for special status.

రాష్ట్రం విడిచిపోయినప్పటినుంచి ఏపీ ప్రజలు ‘ప్రత్యేక హోదా’ కోసం డిమాండ్ చేస్తూ వస్తున్నారు. కొత్తలో నిరసనలు, ఉద్యమాలు కూడా చేశారు. కానీ.. కేంద్రం ఏవేవో కహానీలు చెప్పి, చివరికి ప్యాకేజీతో సరిపెట్టేసుకుంది. దాంతో.. ఏపీలో ఉధృత కాస్త తగ్గింది. ఆ తర్వాత ‘స్పెషల్ స్టేటస్’ ఊసే లేకుండా పోయింది. కానీ.. ఎప్పుడైతే ‘జల్లికట్టు’ కోసం తమిళతంబీలు భారీఎత్తున ఉద్యమం చేయడం మొదలుపెట్టారో, ఇటు తెలుగు ప్రజలు ‘స్పెషల్ స్టేటస్’ కోసం పోరాటం కొనసాగించాలని నడుం బిగించారు. ఈనెల 26వ తేదీన ప్రత్యేకహోదా కోసం విశాఖ ఆర్కే బీచ్‌లో ఉద్యమం చేసేందుకు సమాయత్తమవుతున్నారు. ఇక వీరికి మద్దతుగా జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ నిలిచాడు. ప్రత్యేక హోదాపై కేంద్రం ఇచ్చిన హామీని నిలబెట్టుకోనందుకు నిరసనగా యువత మెరీనా బీచ్ తరహాలో నిరసన చేసిన పక్షంలో తాను మద్దతు ఇస్తానని చెప్పాడు. ఇక ఆ తర్వాత ఆయన చేసిన ట్వీట్లు.. ఆంధ్రుల్లో సెగలు రేపుతున్నాయి.

కేంద్రం తీరును తీవ్రంగా తప్పు పట్టిన ఆయన.. ఏపీ రాజకీయ వర్గాల పైనా విరుచుకుపడ్డారు. ‘గాంధీజీని ప్రేమిస్తాం.. అంబేడ్కర్‌ను ఆరాధిస్తాం.. సర్దార్ పటేల్‌కు సెల్యూట్ చేస్తాం.. రాజ్యాంగాన్ని గౌరవిస్తాం.. కానీ తల ఎగరేసే ఉత్తరాది నాయకత్వం దక్షిణాది ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీస్తూపోతే చూస్తూ కూర్చోం.. మెడలు వంచి కూర్చోపెడతాం’ అని ట్వీట్ చేశాడు. అసలు ‘దక్షిణ భారత దేశంలో ఎన్ని భాషల వారు ఉన్నరన్నది ఉత్తరాది రాజకీయ నేతలకు తెలుసా? వారికి తెలిసిందల్లా అందరూ మద్రాసీలే’ అంటూ మండిపడ్డారు. ఇక ఏపీ రాజకీయ వర్గాలపైనా పవన్ విరుచుకుపడుతూ.. ‘ఆత్మగౌరవం.. బాధ్యత లాంటి గుణాలు ఏపీ రాజకీయ నేతలకు లేవ’ని చెప్పారు. ఏపీ యువతకు శాంతియుత నిరసనలతో ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. ఇదే సమయంలో ఆంధ్ర యువతలో ఉత్సాహం నింపేలా ఓ పోస్ట్ కూడా పెట్టాడు పవన్. ‘తిడితే భరించాం.. విడగొట్టి గెంటేస్టే సహించాం.. ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే మాత్రం ఊరుకోం.. తిరగబడతామని కేంద్రానికి తెలియజేయాలి’ అని యువతని ఉద్దేశిస్తూ ట్వీట్ చేశాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news