Reviewsమంచు విష్ణు, హన్సికల ‘లక్కున్నోడు’ మూవీ రివ్యూ-రేటింగ్

మంచు విష్ణు, హన్సికల ‘లక్కున్నోడు’ మూవీ రివ్యూ-రేటింగ్

Exclusive review of Manchu Vishnu’s latest movie ‘Luckunnodu’. Director Raj Kiran handled this project under MVV banner. Hansika played female lead role in this film.

సినిమా పేరు : లక్కున్నోడు
నటీనటులు : మంచు విష్ణు, హన్సిక, రాజేంద్రప్రసాద్‌, పోసాని, ప్రభాస్‌ శీను, తదితరులు
రచన-దర్శకత్వం : రాజ్‌ కిరణ్‌
నిర్మాత : ఎం.వి.వి.సత్యనారాయణ
సంగీతం : అచ్చు, ప్రవీణ్‌ లక్కరాజు
సినిమాటోగ్రఫీ : పిజి విందా
బ్యానర్ : ఎంవివి సినిమా
రిలీజ్ డేట్ : 26-01-2017

వినోదాత్మక చిత్రాలు చేసుకుంటూ మంచి విజయాలు అందుకుంటున్న మంచు విష్ణు.. తాజాగా ఆ తరహా కథతోనే ‘లక్కున్నోడు’గా ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ‘గీతాంజలి’ (హారర్-కామెడీ జోనర్)తో హిట్ అందుకున్న రాజ్ కిరణ్ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. హన్సిక కథానాయికగా నటించిన ఈ చిత్రం పూర్తి కామెడీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కింది. ఈ మూవీకి సంబంధించిన టీజర్స్, ట్రైలర్స్‌కి ఆడియెన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్సే అందింది. దీంతో.. ఈ చిత్రంపై మంచి అంచనాలే నెలకొన్నాయి. మరి.. ఈ చిత్రం వాటిని అందుకోవడంలో సక్సెస్ అయ్యిందా? లేదా? రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం పదండి..

కథ :
లక్కీ(విష్ణు).. ఇతను దురదృష్టంకి కేరాఫ్ అడ్రస్. మరోవైపు.. పద్మావతి (హన్సిక) అనే అమ్మాయి ఎప్పుడూ పాజిటివ్‌గా ఆలోచిస్తుంటుంది. ఓసారి పద్మావతిని చూసి లక్కీ ప్రేమలో పడతాడు. ఆమె ప్రేమని దక్కించుకోవడం కోసం లక్కీ ప్రయత్నిస్తుంటాడు. కట్ చేస్తే.. లక్కీ చెల్లెలికి నిశ్చితార్థం అవుతుంది. వరుడు ఫ్యామిలీకి రూ.25లక్షలు కట్నం డబ్బులు ఇవ్వడానికి లక్కీ వెళతాడు. కానీ.. అది ఎక్కడో పోతుంది. దీంతో.. తండ్రి (జయప్రకాశ్) కోప్పడటంతో లక్కీ ఆత్మహత్యకు యత్నిస్తాడు. అదే సమయంలో అతని లైఫ్ అనుకోని మలుపు తిరుగుతుంది.

ఓ వ్యక్తి అతని వద్దకు వచ్చి.. ఒక బ్యాగ్ ఇస్తాడు. దాన్ని ఒక్కరోజు ఉంచుకుంటే.. రూ.1 కోటి ఇస్తానని చెబుతాడు. ఇంతకీ ఆ బ్యాగులో ఏముంది? దాన్ని ఇచ్చిందెవరు? అసలు ఆ వ్యక్తి లక్కీకే ఆ బ్యాగ్ ఎందుకు ఇస్తాడు? ఆ తర్వాత ఏమైంది? ఆ బ్యాగ్ వల్ల లక్కీ జీవితంలో ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి? దురదృష్టంకి కేరాఫ్ అడ్రస్ అయిన లక్కీ ‘లక్కున్నోడు’ ఎలా అయ్యాడు? అనే అంశాలతో ఈ సినిమా కథ సాగుతుంది.

విశ్లేషణ :
ఫస్టాఫ్ గురించి మాట్లాడితే.. మొత్తం చాలా సరదాగా సాగిపోతుంది. మొదట్లో నడిచే హీరో లక్కీ ఫ్లాష్‌బ్యాక్.. అందులో అతని బ్యాడ్‌లక్ సీన్లను చాలా కామెడీగా చూపించారు. హీరోయిన్‌తో నడిచే లవ్ ట్రాక్ కూడా బాగుంది. కామెడీ సన్నివేశాలు ఆడియెన్స్‌ని బాగా నవ్వించాయి. ప్రీ-ఇంటర్వెల్ వరకు సినిమా ఎక్కువగా బోరింగ్‌గా లేకుండా.. సరదాగా గడిచిపోతుంది. పాటలు కూడా సందర్భానుకూలంగా వస్తాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ చాలా బాగుంది. సెకండాఫ్ మీద మరింత ఆసక్తి పెంచుతుంది.

సెకండాఫ్ విషయానికొస్తే.. హీరో, విలన్ మధ్య మైండ్‌గేమ్‌తో సాగుతుంది. క్లైమాక్స్ వరకు అదే తంతు. అయితే.. అది అంత ఆసక్తికరంగా లేదు. మధ్యలో కొన్ని అనవసరమైన సన్నివేశాలు చేర్పించి.. మైండ్‌గేమ్‌ని దారి తప్పించేశారు. కొన్ని కామెడీ సీన్స్ ఓవర్‌గా అనిపించాయి. క్లైమాక్స్ అయినా ఆసక్తికరంగా ఉంటుందా అంటే.. అదీ లేదు. రొటీన్‌గానే ఉంది. ఒకే పాయింట్ చుట్టూ కథని రాసుకోవడం మైనస్ పాయింట్. ఇందులో ట్విస్టులు మరిన్ని జోడించి ఉండుంటే.. బాగుండేది. లాజిక్ లేని సన్నివేశాలు కూడా చాలానే ఉన్నాయి. అలాగే.. కథనంపై దర్శకుడు మరింత కసరత్తు చేయాల్సింది.

ఓవరాల్‌గా చూస్తే.. ఫస్టాఫ్ బాగుంది. కామెడీ, లవ్ ఎలిమెంట్స్ చుట్టూ తిరిగే కథ ఆడియెన్స్‌ని బాగానే ఆకట్టుకుంది. కానీ.. సెకండాఫే గాడి తప్పింది. ఇంట్రెస్టింగ్‌గా సాగాల్సిన మైండ్ గేమ్ అంతగా నప్పలేదు. కథనం స్లోగా సాగడం మరో మైనస్. అక్కడక్కడ వచ్చే అనవసరమైన సన్నివేశాలు. చివరగా.. పూర్తిగా మెప్పించలేకపోయినా కాస్త నవ్వులు మాత్రం పండించాడు ఈ లక్కున్నోడు.

నటీనటుల పనితీరు :
గత సినిమాలతో పోల్చుకుంటే.. ఇందులో మంచు విష్ణు కాస్త డిఫరెంట్‌గా, స్టైలిష్‌గా కనిపించాడు. అతని బాడీ లాంగ్వేజ్‌లో మార్పు బాగా కనిపిస్తుంది. అలాగే.. తన కామెడీ టైమింగ్‌తో బాగానే ఆకట్టుకున్నాడు. హన్సిక విషయానికొస్తే.. ఆమె ఉన్నంతలో తన నటనతో, గ్లామర్‌‌తో మెప్పించింది. మునుపటి చిత్రాల్లోకంటే ఇందులో మరింత అందంగా కనువిందు చేసింది. వెన్నెల కిషోర్‌.. సత్యం రాజేశ్‌.. ప్రభాస్‌ శ్రీను కామెడీ పర్వాలేదనిపించిది. ఇతర నటీనటులు పాత్ర పరిధి బాగానే నటించారు.

సాంకేతిక పనితీరు :
పిజి విందా అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రతి ఫ్రేమ్‌ని అందంగా, గ్రాండ్‌గా చూపించాడు. సంగీతం కూడా బాగుంది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అదిరింది. ఎడిటింగ్‌లో జాగ్రత్తలు తీసుకోవాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. దర్శకుడు రాజ్‌ కిరణ్‌ గురించి మాట్లాడితే.. ఫస్టాఫ్ ఎంటర్టైనింగ్‌గా తెరకెక్కించాడు కానీ.. సెకండాఫ్‌ విషయంలో జాగ్రత్తలు తీసుకుని ఉండుంటే బాగుండేది. కథ, కథనంపై మరింత కసరత్తు చేయాల్సింది.

ఫైనల్ వర్డ్ : ఈ ‘లక్కున్నోడు’ లక్ కలిసి రావడం కాస్త కష్టమే.
రేటింగ్ : 2.75/5

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news